మోదీ 4.0 కష్టమే.. సంచలనాల కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అథవాలే మళ్లీ మంత్రి అవుతారన్నది గ్యారంటీ అని అన్నారు. అంతలోనే.. తాను జోక్ చేస్తున్నాని పేర్కొన్నారు.

Update: 2024-09-23 11:55 GMT

ఓవైపు అమెరికాలో పర్యటిస్తున్న మోదీ వచ్చే సారి కూడా తమదే ప్రభుత్వం అన్నంత ధీమాగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రభుత్వంలోని నంబర్ 2, కేంద్ర హొం మంత్రి అమిత్ షా కూడా నాలుగోసారి మోదీ సర్కారే అని చెబుతున్నారు. అసలు ఏ ప్రభుత్వమైనా రెండుసార్లు వరుసగా అధికారంలోకి రావడమే గొప్ప. భారత దేశంలో చాలా రాష్ట్రాల్లో రెండుసార్లు వరుసగా నెగ్గిన ప్రభుత్వాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అది కూడా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలే. జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రికార్డు సాధ్యం కాదు.

ఇక కేంద్రంలో అయితే ఇది చాలా కష్టమే అని చెప్పాలి. కానీ.. వరుసగా మూడోసారి సర్కారు ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. స్వతంత్ర భారత దేశంలో నెహ్రూ తర్వాత ఈ ఘనత అందుకున్న ప్రధాని మోదీ కావడం విశేషం. ఇప్పుడిక మోదీ 4.0పై చర్చ మొదలైంది.

గడసరి గడ్కరీ.. మోదీకి ప్రత్యామ్నాయం మహారాష్ట్రలోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించే నితిన్ గడ్కరీ బీజేపీలో చాలా కీలక నాయకుడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. పైగా ఆర్ఎస్ఎస్ మనిషి. అందుకే స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేస్తుంటారు.

అవి కొన్నిసార్లు సంచలనంగానూ మారుతుంటాయి. ఇక శాఖాపరంగానూ గడ్కరీది సూపర్ ట్రాక్ రికార్డు. ఉపరితల రవాణా శాఖా మంత్రిగా ఆయన అనేక రహదారులను జాతీయ రహదారులుగా మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పలు జాతీయ రహదారుల పనులు నడుస్తున్నాయంటే అది గడ్కరీ ఘనతే. అందుకే నాయకత్వపరంగా మోదీకి తదుపరి ఎవరంటే బీజేపీలో చాలా మంది నితిన్ గడ్కరీ పేరే చెబుతారు.

మళ్లీ గెలుస్తామో లేదో?

తమ ప్రభుత్వం వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేమని గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలో మరో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలేతో కలిసి ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అథవాలే మళ్లీ మంత్రి అవుతారన్నది గ్యారంటీ అని అన్నారు. అంతలోనే.. తాను జోక్ చేస్తున్నాని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నేత అథవాలే.. వరుసగా మూడుసార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సోషల్ మీడియాలో వైరల్..అసలే గడ్కరీ.. ఆపై సంచలన వ్యాఖ్యలు.. దీంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. వచ్చేసారి కూడా మంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా.. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇలాగే మాట్లాడేవారని గడ్కరీ గుర్తు చేశారు.

ఎన్నికల ముంగిట మహారాష్ట్రలో వచ్చే నవంబరులో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అథవాలే పార్టీ మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఉంది. 10 నుంచి 12 స్థానాలు అడుగుతోంది. ఈ కూటమిలో బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌ సీపీలు ఉన్నాయి. కాగా, మహారాష్ట్రలో ఎన్నికలు రెండు నెలలు కూడా లేని సమయంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శివసేన, ఎన్సీపీలను చీల్చి బీజేపీ అధికారంలోకి రావడం, పరస్పర విరుద్ధ పార్టీలు అధికారం పంచుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ కూటమిని దెబ్బకొట్టేలా ఉన్నాయి.

Tags:    

Similar News