‘పొత్తు’పై మోడీ గుర్రు.. మంత్రాంగం మొత్తం అమిత్ షాదేనా?
కానీ.. మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ తరఫున కనిపించాల్సిన మోడీ మాష్టారు మాత్రం ఎక్కడా లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అనుకున్నదే జరిగింది. అంచనాలు తప్పలేదు. ఏపీలో మహా పొత్తు పొడిచింది. ముందు నుంచి అంచనాలకు తగ్గట్లే విపక్ష తెలుగుదేశం.. జనసేన.. బీజేపీలు కలిపి ఉమ్మడిగా వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. దీంతో 2014 నాటి మేజిక్ రిపీట్ అవుతుందని తెలుగు తమ్ముళ్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిన తీరుపైనే సందేహాలన్ని. ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి బీజేపీనే అంతా చూసుకుంటుందని అనుకున్నా.. మోడీ మాష్టారి కనుసైగ లేకుండా ఏదీ ముందుకు సాగదు. అయితే.. ఈ పొత్తుకు సంబంధించిన ఎపిసోడ్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆసక్తికర అంశం ఒకటి కనిపిస్తుంది.
ఈ మూడు పార్టీలతో పొత్తుకు సంబంధించిన గతంలో జరిగిన భేటీలకు తుది రూపంగా తాజా భేటీ జరగటం.. ఇందులో అమిత్ షా.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు కలిసి కూటమిగా ఏర్పడి.. ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. కూటమిలో భాగంగా ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పటం బాగానే ఉంది. కానీ.. మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ తరఫున కనిపించాల్సిన మోడీ మాష్టారు మాత్రం ఎక్కడా లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
చంద్రబాబుతో జట్టు కట్టే విషయంలో నరేంద్ర మోడీకి అభ్యంతరాలు ఉన్నాయని.. అయితే.. తన నీడలాంటి అమిత్ షా మాత్రం ఏపీలో పొత్తు ఉండాల్సిందేనని పట్టుబట్టటంతో ఆయన సరేననక తప్పలేదంటున్నారు. ఈ కారణంతోనే.. ఆయనతో ఇప్పటివరకు పొత్తు ఎపిసోడ్ కు సంబంధించి ఒక్కటంటే ఒక్క భేటీ కూడా సాగలేదన్న మాట బలంగా వినిపిస్తుంది. తాను అనుకోవాలే కానీ.. అర్థరాత్రి అయినా టైమిచ్చి.. లేదంటే తానే చొరవ తీసుకొని భేటీ అయ్యే లక్షణం ఉన్న నరేంద్ర మోడీ.. ఏపీలో పొడిచిన మహా పొత్తు ఎపిసోడ్ మొత్తంలో ఆయన జాడే లేకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మిగిలిన సందర్భాల సంగతి ఎలా ఉన్నా.. పొత్తు కుదిరిన తర్వాత అయినా మర్యాదపూర్వకంగా అయినా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరిని భేటీ అవ్వొచ్చు. కానీ.. అలా జరగకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ లోటును భర్తీ చేసేందుకు వీలుగా చిలకలూరిపేటలో నిర్వహించే సభ (మార్చి 17-18లో జరగనుంది)కు ప్రధాని మోడీ హాజరవుతారని.. కూటమిపై రియాక్టు అవుతారని చెబుతున్నారు. ఏమైనా.. పొత్తు ఎపిసోడ్ ను జాగ్రత్తగా ఫాలో అయితే మాత్రం.. బాబుతో పొత్తు పెట్టుకోవటం మోడీకి పెద్దగా ఇష్టం లేదని.. ఈ కారణంతోనే ఆయన సీన్లోకి రాలేదంటున్నారు.