నాన్ స్టాప్ పనులతో రూపురేఖలు మారిపోతున్న అమరావతి

ఏపీ రాజధానిగా శంకుస్థాపన చేసి.. ఇప్పటికే పలు భవనాలు నిర్మాణం జరిగి.. కొన్ని ప్రారంభం కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో నిలిచి ఉన్నవైనం తెలిసిందే.

Update: 2024-06-10 05:37 GMT

ఏపీ రాజధానిగా శంకుస్థాపన చేసి.. ఇప్పటికే పలు భవనాలు నిర్మాణం జరిగి.. కొన్ని ప్రారంభం కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో నిలిచి ఉన్నవైనం తెలిసిందే. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు అమరావతిని పక్కన పెట్టి.. మూడు రాజధానుల మీద ఫోకస్ చేయటం తెలిసిందే. మూడు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని ఉంచినప్పటికీ.. ఆ ప్రాంతంలో మొదలైన పనుల్ని పట్టించుకున్నది లేదు. చివరకు బాగా వేసిన రోడ్లను పట్టించుకున్నది లేదు. దీంతో.. తీవ్రమైన నిరాదరణతో పెద్ద ఎత్తున పిచ్చిచెట్లు మొలిచి.. అడవిని తలపించేలా పరిస్థితి మారింది. ఇక.. వీధి దీపాలు మొదలు ఏమీ అందుబాటులోకి రాని పరిస్థితి.

ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వెల్లడై.. తెలుగుదేశం కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసిందో.. ఆ తర్వాతి రోజు నుంచే అమరావతిలో అప్పటివరకు నెలకొన్న స్తబ్దత తొలిగింది. కొత్త చైతన్యంతో ఐదేళ్ల క్రితం అక్కడ ఆగిన పనులు మొదలయ్యాయి. దాదాపు 109 కిలోమీటర్ల పరిధిలోని 673 ఎకరాల విస్తీర్ణంలోని ముళ్ల కంపలు.. పిచ్చి చెట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులు రాత్రి పగలు అన్న తేడా లేకుండా సాగుతున్నాయి. దీంతో.. ఇంతకాలంగా లేని కొత్త రూపును అమరావతి సంతరించుకుంటోంది.

మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. అప్పటికి అమరావతి పనుల్ని ఒక కొలిక్కి తీసుకురావటం.. రోడ్లను ఒక పద్దతిలోకి తేవటంతో పాటు. విద్యుత్ దీపాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటంతో పాటు.. తాము కలలు కన్న అమరావతి కలను సాకారం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి కమిట్ మెంట్ తో ఉందన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించాలన్నది లక్ష్యంగా మారింది.

ప్రమాణస్వీకార వేళకు అమరావతికి కొత్త కళను తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వం అర్థంతరంగా ఆపేసిన పనులకు సంబంధించి.. అప్పట్లో నిర్మించిన నిర్మాణాల పటిష్టత ఎంత ఉందన్న విషయాన్ని తేల్చేందుకు ఇంజినీరింగ్ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. నివేదిక వచ్చినంతనే పనులు షురూ చేయనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ మీద రెండు దశాల్లో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును తాజాగా పూర్తిచేశారు.వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు మొత్తం 9కి.మీ. మేర వీధి దీపాల్ని ఏర్పాటు చేశారు.

కరకట్ట రోడ్డు.. అసెంబ్లీ.. హైకోర్టు. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఐఏఎస్ అధికారుల నివాసాలకు వెళ్లేందుకు రోడ్లు లేవు. ఇవన్నీ ముళ్లపొదలతో నిండిపోయాయి. వీటన్నింటిని శుశ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న జడ్జిల బంగ్లాలు.. న్యాయ సముదాయం.. సచివాలయ టవర్లు.. ఎన్జీవో అపార్టుమెంట్లు. విట్ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గంతో పాటు ఎస్ఎంఆర్ వర్సిటీ.. అమ్రత వర్సిటీ.. ఎంఐజీ లేఔట్ మొదలు స్టేడియం.. ఇతర కీలక మార్గాల్లోని పిచ్చి చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తూ.. అమరావతికి కొత్త రూపు సంతరించేలా చేస్తున్నారు. మొత్తానికి తన రాకతో మార్పు మొదలైందన్న విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి.

Tags:    

Similar News