ఆ దేశానికి సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టిన ఇ-కార్లు!
పెట్రోల్, డీజిల్ కార్లు కాకాకుండా ప్రజలంతా ఎలక్ట్రిక్ కార్లనే ఉపయోగించాలంటూ చాలా దేశాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ కార్లు కాకాకుండా ప్రజలంతా ఎలక్ట్రిక్ కార్లనే ఉపయోగించాలంటూ చాలా దేశాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. వాతావరణంలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో పదో వంతు వాహనాల వాటానే ఉండటంతో.. ఎలక్ట్రిక్ కార్లను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఆ కార్లు కొనేవారికి అదనపు రాయితీలు ఇస్తున్నాయి.
ఈ సమయంలో తాజాగా నార్వే దేశం కూడా ఎలక్ట్రిక్ కార్లను కొంటామంటే చాలు పన్ను మినహాయింపులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎలక్ట్రిక్ కార్లకు టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేసేసింది! విదేశాల నుంచి ఇంపోర్ట్ చెసుకున్నా కూడా ఎలాంటి పన్నులూ విధించకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆలోచనే ఆ దేశానికి సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు.
అవును... ఆర్థికంగా స్థితిమంతమైన ప్రభుత్వం ఉన్న దేశాల్లో ఒకటైన నార్వే... ప్రపంచంలోనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ప్రశాంతమైన పరిస్థితులు ఉండే దేశాల్లో ఒకటిగా పేరు సంపదించుకుంది. ఇక్కడ ప్రభుత్వం ప్రజలను బాగా చూసుకుంటుందని పేరు. కాకపోతే కాస్త ట్యాక్సులు ఎక్కువని అంటుంటారు. ఈ సమయంలో ఆ దేశం ఎలక్ట్రిక్ కార్లను చాలా ప్రోత్సహించింది.
ఇందులో భాగంగా... గత పదేళ్లలో ఎలక్ట్రిక్ కార్లు కొన్నవారికి గత పదెళ్లుగా అనేక ప్రోత్సాహకాలు ఇచ్చింది. వీటిలో ప్రధానంగా... ఎలక్ట్రిక్ కార్లు కొనేవారికి ప్రభుత్వం వైపు నుంచి ఆ కారుపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతేకాదు.. ఎలక్ట్రిక్ కార్లకు రోడ్డుపై టోల్ కూడా ఉండదంటూ నార్వే ప్రభుత్వమా అఫర్ ఇచ్చింది.
ఇంకేముంది.. కారు కొనాలనుకున్నవారంతా ఎలక్ట్రిక్ కార్లను కొనడం మొదలుపెట్టారు. ఓ పక్క ప్రభుత్వానికి పన్ను కట్టనవసరం లేదు, పెట్రోల్ మెయింటినెన్స్ కూడా లేదు, దీనికి తోడు రోడ్లపై టోల్ ట్యాక్స్ కూడా కట్టనవసరం లేదు. దీంతో... ఇప్పుడు అక్కడ నూటికి 90 శాతం వరకూ ఎలక్ట్రిక్ కార్లే ఉన్నాయని అంటున్నారు.
అమ్ముడవుతున్న పది కార్లలో తొమ్మిది ఎలక్ట్రిక్ కార్లే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నార్వే ప్రభుత్వానికి సరికొత్త సమస్యలు వచ్చాయని అంటున్నారు. ఇందులో ప్రధానంగా... ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనాలు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ కార్లు కొనేశారంట. దీంతో.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వాడేవారు గణనీయంగా తగ్గారని అంటున్నారు.
ఇలా ఎలక్ట్రిక్ కార్ల వల్ల ప్రభుత్వానికి పన్ను లేదు.. పెట్రోల్ - డీజిల్ పై ఆదాయమూ తగ్గిపోయింది.. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వాడేవారు తగ్గిపోయారు! దీంతో... నార్వే దేశ రాజధాని ఓస్లోలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ప్రజలు ఎవరికి వారు కార్లలో తిరగడం వల్ల బస్సులు, మెట్రో లు ఖాళీగా తిరుగుతున్నాయంట.
ఇలా ఇప్పుడు నార్వే దేశంపై ఎలక్ట్రిక్ కార్ల ప్రభావం తీవ్రంగా ఉందని అంతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడిందని చెబుతున్నారు. దీంతో... ఈ విషయంలో ప్రోత్సాహకాలు ఇచ్చే దేశాలు నార్వేను ఓ గుణపాఠంగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.