జగన్ ని బ్లేం చేయడం లేదు... కానీ ...పవన్
జగన్ నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక అవినీతి పనులు చేస్తే ఆయన ఎందుకు వాటిని చూస్తూ ఉన్నారని ప్రశ్నించారు.
తిరుమల తిరుపతిలో అనేక అక్రమాలు గడచిన అయిదేళ్లుగా చోటుచేసుకుంటే మౌనంగా ఉండడం జగన్ చేసిన తప్పు అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక అవినీతి పనులు చేస్తే ఆయన ఎందుకు వాటిని చూస్తూ ఉన్నారని ప్రశ్నించారు.
తాము లడ్డూ ప్రసాదాల విషయంలో జగన్ ని బ్లేం చేయాలని అనుకోవడం లేదని పవన్ చెప్పడం విశేషం. అయితే అదే సమయంలో జగన్ టీటీడీలో ఏ రకమైన అక్రమాలు జరగలేదని చెప్పగలరా అని అన్నారు. ఆయన స్వచ్చంగా ఉండాలనుకుంటే ఎందుకు ఇన్ని డ్రామాలు అని ప్రశ్నించారు
ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని మధ్యలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఏమి ఉందని అన్నారు. టీటీడీలో గడచిన పాలక వర్గం వైసీపీ హయాంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడింది అని డిప్యూటీ సీఎం అన్నారు. వాటి విషయంలో తమ ప్రభుత్వం జగన్ మాదిరిగా చూస్తూ ఊరుకోదని తప్పని సరిగా సమగ్రమైన దర్యాప్తు చేస్తామని అన్నారు. ఈ విషయంలో టీటీడీ ఆస్తులను కాపాడుకుంటామని అన్నారు.
జగన్ తప్పు చేసిన వారిని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఎంతో సొమ్ము చేతులు మారిందని పవన్ ఆరోపించారు. అలాగే ఉపచరాలలో సైతం అపచారాలు జరిగాయని అన్నారు.
ఇంత జరిగినా ఏమీ జరగలేదు అని అంటే ఎలా అని అన్నారు. సీబీఐ విచారణ కావాలి అని అంటున్నారు కానీ సిట్ దర్యాప్తుతోనే ఎన్నో విషయాలు వెల్లడి అవుతాయని అన్నారు. తాము దోషుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పవన్ ప్రాయాశ్చిత్త దీక్షలో ప్రస్తుతం ఉన్నారు. శ్రీవారి ఆలయంలో అనేక తప్పులు జరిగాయని దానిని ప్రాయాశ్చిత్తంగానే ఈ దీక్ష అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ కచ్చితమైన వైఖరిని తీసుకుని ఈ విషయంలో ముందుకు సాగుతున్నారు.
అదే సమయంలో ఆయన జగన్ ని బ్లేం చేయలేను అనడం కూడా విశేషంగానే ఉంది. ఆయన ఆలోచనల మేరకు సీఎం ఈ విషయంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవరు అని ఉండి ఉండొచ్చు. అయితే పవన్ అంటున్నది ఏంటి అంటే తన ఆధ్వర్యంలో నియమించిన టీటీడీ బోర్డు ఎలా పనిచేస్తుందో చూసుకోవాలిన బాధ్యత ఉండాలి కదా అని.
ఇక ఇంత జరిగినా తప్పు చేసిన వారిని జగన్ ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు అని. ఇక్కడ తమాషా ఏంటి అంటే చంద్రబాబు జగన్ మీదనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తూంటే పవన్ మాత్రం గత టీటీడీ బోర్డు దే తప్పు అని అంటున్నారు మొత్తానికి ఏపీలో రాజకీయం ఆసక్తికరంగానే ఉంది అని అనుకోవాలి.