సూదితో పని లేదు.. చెమటతో షుగర్ టెస్టు.. తెలుగోడి విజయం
అయితే.. షుగర్ టెస్టులు తరచు చేయించుకోవటం ఖర్చుతో కూడుకున్న పని మాత్రమే కాదు.. సూది నొప్పి తెగ ఇబ్బంది పెట్టేస్తుంటుంది.
మిగిలిన పరీక్షలు ఒక ఎత్తు షుగర్ టెస్టు మరో ఎత్తు. షుగర్ సమస్యను ఎదుర్కొనే వారు ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ లెవల్ ఎంతన్నది చూసుకోవటం ద్వారా.. అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అయితే.. షుగర్ టెస్టులు తరచు చేయించుకోవటం ఖర్చుతో కూడుకున్న పని మాత్రమే కాదు.. సూది నొప్పి తెగ ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు ఒక తెలుగోడు. తాజాగా ఆయనకు భారత ప్రభుత్వం పేటెంట్ కూడా జారీ చేసింది.
ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు కనుగొన్న సరికొత్త ఎలక్ట్రోకెమికల్ పరికరం పుణ్యమా అని.. షుగర్ టెస్టుకు సూది నొప్పి నుంచి బయటపడేలా చేయటమే కాదు.. తక్కువ ఖర్చుతో చేసుకునే పరిస్థితి. రక్తంలో గ్లూకోజ్ ను నిర్దారించటానికి ఆయన కనుగొన్న పరికరానికి రక్తం అవసరం లేదు. ఒంటి మీద చెమట సరిపోతుంది. నిమిషం వ్యవధిలోనే షుగర్ లెవల్ ఎంతన్నది ఇట్టే తెలుసుకునే వీలుంది.
ఈ పరిశోధనను నిశితంగా పరిశీలించిన భారత సర్కారు.. ఆయన రూపొందించిన పరికరానికి పేటెంట్ కల్పిస్తూ ధ్రువపత్రాన్ని జారీ చేశారు. ప్రస్తుతం ఐఐటీ కాన్పుర్ లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సైంటిస్టుగా పని చేస్తున్న ఆయన.. 18 ఏళ్ల లోపు చిన్నారులు టైప్ 1 మధుమేహం బారిన పడితే.. రోజూ నాలుగుసార్లు గ్లూకోజ్ టెస్టు చేసుకొని.. ఇన్సులిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ముప్పు.
షుగర్ జబ్బులో ఇబ్బంది పడే టైప్ 2 బాధిుతలదీ ఇలాంటి పరిస్థితే. ఇలాంటి వేళ.. అలాంటి వారికి మరింత సులువుగా..నొప్పి లేని రీతిలో పరీక్షలు చేసుకునేలా పరికరాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో శ్రమించిన ఆయన.. చివరకు ఒక పరికరాన్ని సిద్ధం చేశారు. డిసెంబరు 29న ఇండియన్ పేటెంట్ అధారిటీ ఆయనకు ధ్రువపత్రాన్ని జారీ చేసింది.
ఈ ఘనతను సాధించిన చిరంజీవి శ్రీనివాసరావు విషయానికి వస్తే.. ఆయన తండ్రి భీమయ్య వాచ్ మన్ కాగా.. తల్లి దుర్గ కూలి పనులకు వెళుతుంటారు. ఆంధ్రా వర్సిటీలో పీజీ చేసిన ఆయన.. నాలుగేళ్లుగా ఈ పరికరాన్ని రూపొందించేందుకు కష్టపడుతున్నారు. తాను కనుగొన్న పరికరం అందరికి అందుబాటులోకి వస్తే.. పేద.. మధ్యతరగతి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరి.. ఆయన కష్టాన్ని..సాధించిన విజయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారో చూడాలి.