ఆర్టికల్ 370 పునరుద్ధరణ.. ఎన్నికల వేళ ఆ పార్టీ హామీ!

దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-20 04:16 GMT

దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో ఒకటి జమ్ముకశ్మీర్. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఇలాంటి వేళ.. ఆ రాష్ట్రానికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.

సోమవారం మొత్తం 12 అంశాలతో కూడిన హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తొలి తీర్మానం చేస్తామని ప్రకటించిన ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. దశాబ్దాల తరబడి నలుగుతున్న జమ్ముకశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారంగా ఆర్టికల్ 370ను రద్దు చేసిన మోడీ సర్కారు.. చారిత్రక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.

ఇప్పుడు.. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ప్రయోజనాన్ని పొందేందుకు ఎత్తుగడ వేసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల హామీకి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు నమోదవుతాయన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవటం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా వెల్లడించారు. అయితే.. కశ్మీర్ లోయలో ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కశ్మీర్ లోయలో దాదాపు ఎనిమిది నుంచి పది వరకు స్వతంత్ర్య అభ్యర్థులతో కలిసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ చర్చల తర్వాతే తాము తమ మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేయటం గమనార్హం. ఆర్టికల్ 370ను తీసుకొస్తామంటూ ఒమర్ అబ్దుల్లా చేస్తున్న వ్యాఖ్యల్ని రవీందర్ ఖండించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు కావటంతో జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన సంగతి తెలిసిందే. 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరి.. కశ్మీర్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News