ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క..!
ఇక, బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో కొత్త వారికి అవకాశం ఇస్తూ.. బీఆర్ ఎస్ ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీల మధ్య జరిగిన తంతు ఒక లెక్క. ఇక, శుక్రవారం నుంచి జరగబోయేది మరో లెక్క! అంటున్నారు పరిశీలకులు. శుక్రవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ ఎస్, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు మరింత రసవత్తరంగా సాగుతుందని చెబుతున్నారు. నిజానికి నోటిఫికేషన్ విడుదల తర్వాత.. రాజకీయ వేడి పెరిగింది. జంపింగులు.. టికెట్ల పంపకాలు.. నేతల బుజ్జగింపులు జరిగాయి.
ఇక, ఆ తర్వాత.. పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే.. ప్రాచరం చేపట్టాయి. ఈ క్రమంలో గత 2018 ఎన్నికలకు భిన్నంగా.. ఈ దఫా గ్రామీణ స్థాయిలో ఎక్కువగా కాంగ్రెస్ ఫోకస్ చేయగా.. బీఆర్ ఎస్.. మళ్లీ సెంటిమెంటు మంత్రాన్ని జపించేందుకు అవకాశాలు వెతుకుతోంది.ఇక, బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో కొత్త వారికి అవకాశం ఇస్తూ.. బీఆర్ ఎస్ ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
ఇది.. ఇప్పటివరకు అంటే నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాకముందు వరకు జరిగిన రాజకీయం. ఇక, ఇప్పుడు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నేపథ్యంలో ఈ పార్టీలు మరింత దూకుడు పెంచుతున్నాయి. సీఎం కేసీఆర్.. ఇప్పటి వరకు ఒకే జిల్లా లేదా రెండు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారాన్ని ఉద్రుతం చేశారు. అయితే, ఆయన ఇప్పటి నుంచి రోజుకు మూడు జిల్లాల్లో ఎన్నికలకు 10 రోజుల ముందు.. మరింత ఎక్కువగా ప్రచారం చేయనున్నారు.
అదేసమయంలో బీజేపీ కూడా కీలక నేతలకు హెలికాప్టర్లలో ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్‌లు హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారం చేయనున్నారు. ఇక, మరో పార్టీ కాంగ్రెస్.. కూడా నామినేషన్ల ఘట్టం నుంచి దూకుడు పెంచనుంది. తమకు మద్దతు ప్రకటించేవారిని చేరదీసి.. వారితోనూ ప్రచారం చేయించే పర్వానికి తెరదీసింది. మొత్తంగా చూస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్నటి వరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ప్రచారం హోరెత్తిపోనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.