ఇదేం..'ఎన్నికల ప్రచారం'!
తాజాగా జరుగుతున్న ఎన్నికల ప్రచారమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు మాట్లాడుతున్న భాష స్థాయి దాటిపోతోంది. సాధారణ ప్రజలు కూడా వాటిని విని ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీల అధినేతలుగా, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలుగా ఉంటూ ఇదేం భాష అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యక్తిగత విమర్శలు ఉండేవి కాదు. భాష, మాటపైనా అదుపు ఉండేది. సిద్ధాంతపరంగా, అభివృద్ధిపరంగానే నేతల మధ్య విమర్శలు ఉండేవి. అవి కూడా ఒక స్థాయి వరకే ఉండేవి. కట్టుదాటేవి కాదు. ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో ఎదురైనా ఒకరికొకరు నవ్వుతూ అభివాదం చేసుకునేవారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి తమకు ఓట్లేయాలని అడిగేవారు. రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి చక్కటి సంబంధాలకు మీడియాలోనూ మంచి ప్రాధాన్యత లభించేది.
అయితే రానురాను రాజకీయ ప్రత్యర్థులు.. ఆగర్భ శత్రువుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఎన్నికల ప్రచారమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రతిపక్షం నేత, టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి శాడిస్టు, హంతకుడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం వలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పింఛన్ల లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎండ దెబ్బ తాళలేక రాష్ట్రవ్యాప్తంగా పలువురు లబ్ధిదారులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో అవ్వాతాతల చావులకు చంద్రబాబే కారణమని, ఆయనను హంతకుడు అని ఎందుకనకూడదని, చంద్రబాబు మనుషులే ఎన్నికల సంఘానికి వలంటీర్లపై ఫిర్యాదులు చేశారని జగన్ విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు పశుపతి అని, చంద్రముఖి అని తీవ్ర విమర్శలను ఎక్కుపెడుతున్నారు.
మరోవైపు 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా ఏం తగ్గడం లేదు. సీఎం వైఎస్ జగన్ ను సైకో అని దూషిస్తున్నారు. బాబాయిని హత్య చేసినవాళ్లను కాపాడుతున్నారని జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సైకో పాలనలో అంతా విధ్వంసం జరిగిందని మండిపడుతున్నారు. జగన్ ఒక రాక్షసుడు అని, దొంగ అని, జలగ అని విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందజేశారు. చంద్రబాబుపై ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా జగన్ ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు వైసీపీ నేతలు చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందజేశారు. దీంతో ఎన్నికల సంఘం జగన్, చంద్రబాబుకు షోకాజు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఇరువురినీ ఆదేశించింది. లేకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని హెచ్చరించింది. మరి ఇప్పటికైనా జగన్, చంద్రబాబు తమ భాషను మార్చుకుంటారో, లేదో వేచిచూడాల్సిందే.