ఏపీలో కొత్త దోస్తీ : విపక్షాలు కలుస్తాయా.?
రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులు పరిణామాలు వాటి రూపురేఖలను మారుస్తూ ఉంటాయి.
రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులు పరిణామాలు వాటి రూపురేఖలను మారుస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే వైసీపీ పుట్టాక ఒంటరిగానే ముందుకు సాగుతూ వచ్చింది. 2011 నుంచి ప్రతీ ఎన్నికలోనూ సింగిల్ గానే ఫైట్ ఇస్తూ వచ్చింది. అందులోనే విజయాలు అందుకుంది.
అయితే ఈ సోలో పోరాటం 2024లో దారుణంగా బెడిసికొట్టింది. కేవలం 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. అలా కాకుండా వైసీపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఉంటే గెలుపు దక్కకపోయినా సులువుగా ఒక నలభై సీట్లు అయినా దక్కేవి అన్న చర్చ ఉంది. ఎందుకంటే వైసీపీ నలభై శాతం ఓట్లు వచ్చినా ఆ స్థాయిలో సీట్లు రాలేదు అంటే చాలా నియోజకవర్గాలలో ఓట్లు చీలిపోవడం వల్ల అని అంటున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ దారుణమైన పరాజయానికి గురి అయి నెలన్నర రోజులు కావస్తోంది. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. కూటమి ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. సమయం చూస్తే కేవలం అయిదేళ్ళే. జగన్ చెప్పిన పరిభాషలో చెప్పుకోవాలంటే కళ్ళు మూసుకుంటే ఇట్టే గిర్రున తిరిగిపోతాయి. ఒక వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమం ఇంకో వైపు భారీ ప్రాజెక్టులు ఇవన్నీ ఈ అయిదేళ్ళ కాలంలో చేయడం అంటే కత్తి మీద సామే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తే కొంత అస్థిరంగానే ఉంది.
దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సమస్యలు దానికి ఉన్నాయి. అనుకున్నంతగా కేంద్రం నుంచి ఆర్థిక సాయం దక్కకపోతే ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదు. అదే సమయంలో కొన్ని ఇష్యూస్ లో బీజేపీ మొండి పట్టు టీడీపీకి గుదిబండగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రైవేటీకరణకు మొగ్గు చూపుస్తుందని అంటున్నారు.
మేము వ్యాపారాలు చేయమని కేంద్ర ప్రభుత్వ పెద్దలే అంత ఓపెన్ గా చెప్పాక ఇంక ఆలోచించాల్సింది ఏమి ఉంటుంది అని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ తో పాటు ఒక లిస్ట్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉప సంహరించుకోవాలని చూస్తోంది. దాంతో ఆటోమేటిక్ గా అవి ప్రైవేట్ వైపే ఉంటాయని అంటున్నారు.
ఈ విషయంలో కనుక ఏపీలో కూటమి పెద్దలు సాధించుకోకపోతే ఏపీలో పెను రాజకీయ గండం పొంచి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తా కధనం మీద టీడీపీ నేతలు గుస్సా అయి ఆ పత్రిక ఆఫీస్ బోర్డుని దగ్దం చేశారు. దీని మీద కామ్రేడ్ ఖండించాయి. వైసీపీ కాంగ్రెస్ కూడా ఖండించింది.
ఇక్కడ ఈ మూడు పార్టీలూ కలిశాయి అంటే అది స్టీల్ ప్లాంట్ ఇష్యూతోనే అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఇష్యూలో కనుక కేంద్రం ప్రైవేట్ వైపు మొగ్గితే అదే ఈ పార్టీల మధ్య దోస్తీకి కూటమి మీద కుస్తీకి కారణం అవుతుంది అని అంటున్నారు.
అదే విధంగా మరో ఇష్యూ ఉంది. ఇది కూడా కీలకమైనదే. అదేంటి అంటే ప్రత్యేక హోదా ఇష్యూ. ఈ ఇష్యూతో వైసీపీ ఉంది. కామ్రేడ్స్ కాంగ్రెస్ కూడా ఉన్నాయి. బీజేపీ నుంచి తగిన హామీని పొంది ప్రత్యేక హోదాను తీసుకుని రావాలని అపుడే ఈ మూడు పార్టీలు డిమాండ్ చేశాయి. రానున్న రోజులలో కనుక ఈ దిశగా ప్రయత్నాలు సాగకపోయినా కేంద్రం తీరు వేరుగా ఉన్నా అది కూడా ఏపీలో విపక్షాల మధ్య రాజకీయ ఏకీకరణకు కారణం కావచ్చు అని అంటున్నారు.
ఆలా కొత్త దోస్తీ కనుక బలపడితే అది కూటమికి పెను సవాల్ కావడమే కాదు వైసీపీకి కొండంత బలంగా మారే పరిణామమూ ఉండొచ్చు అని అంటున్నారు. సో కేంద్రంలోని బీజేపీ ఏపీ పట్ల ఎలా వ్యవహరిస్తుంది, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన కేంద్రం నుంచి ఏ మేరకు పరిష్కారాలు కనుగొంటారు అన్న దాని మీదనే ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.