హాట్ టాపిక్... భారత్ వల్ల పాక్ భయంకరమైన రాత్రిని చవిచూడాల్సి వచ్చేది!

ఆ రోజే... భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ను దాయాది పాకిస్థాన్‌ బంధించి చిత్రహింసలకు గురిచేసింది.

Update: 2024-01-08 07:25 GMT

2019 ఫిబ్రవరి 27న యావత్ భారతదేశం రగిలిపోయిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న సగటు భారతీయుడు పాక్ పైకి దూకుకెళ్లడానికి సిద్ధపడిపోయాడు. ఆ రోజే... భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ను దాయాది పాకిస్థాన్‌ బంధించి చిత్రహింసలకు గురిచేసింది. ఈ విషయం తెలిసిన అనంతరం అటు పాక్ - ఇటు భారత్ పీఏంఓ లతోపాటు ఇరు దేశాల హైకమీషనర్స్ వద్ద ఏమి జరిగింది.. భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... ఫిబ్రవరి 27న అభినందన్‌ వర్ధమాన్‌ ను పాక్‌ బంధించిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే విషయాలను పాక్ లో భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా తన పుస్తకంలో బయటపెట్టారు. వీటిల్లో కొన్నింటిని ఓ జాతీయ మీడియా సంస్థ తాజాగా తమ కథనంలో వెల్లడించింది. ఇందులో భాగంగా... నాడు భారత దౌత్య నీతితో పాక్‌ ఎలా భయపడింది? అనేది స్పష్టంగా పొందుపరిచారు!

ఇందులో భాగంగా... ఫిబ్రవరి 27న అభినందన్‌ వర్ధమాన్‌ ను పాక్‌ బంధించిన తర్వాత భారత్‌ తీవ్రంగా స్పందించిందని తెలిపిన అజయ్ బిసారియా... ఆ క్షణం పాక్ పైకి 9 క్షిపణులతో భారత్ సిద్ధమైందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పాక్‌ తీవ్రంగా భయపడిందని అన్నారు. ఆ సమయంలో భారత్‌ కు అప్పటి పాక్ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌ లో ఉన్నారని.. ఆ అర్ధరాత్రి తనను సంప్రదించి పలు విషయాలు చెప్పారని తన పుస్తకంలో వెల్లడించారు.

ఇదే క్రమంలో ఆ రాత్రి తనను సంప్రదించి "ఇమ్రాన్‌ ఖాన్‌.. మోడీతో ఫోన్‌ లో మాట్లాడాలనుకుంటున్నారు" అని సోహైల్‌ మహమ్మద్‌ తెలిపారని అజయ్ వెల్లడించారు. అప్పుడు ఖాన్‌ తో మాట్లాడేందుకు ప్రధాని మోడీ అందుబాటులో లేరని అధికారులు తనకు చెప్పారని.. ఆ సమయంలో పాక్‌ కు ఏదైనా అత్యవసరమైతే హైకమిషనర్‌ అయిన తనతోనే మాట్లాడాలని చెప్పాలని సూచించారని అజయ్ తెలిపారు.

అయితే ఆ అర్ధరాత్రి అభినందన్‌ వర్ధమాన్‌ ను విడిపించుకునేందుకు పాక్‌ వైపు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్‌ ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు కానీ, దాని వల్లే అప్పటి ఖాన్‌ ప్రభుత్వం భయపడిందని అజయ్‌ బిసారియా తన పుస్తకంలో వివరించారు. ఈ క్రమంలోనే 2019లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. "అభినందన్‌ ను పాక్‌ విడిచిపెట్టి మంచి పని చేసింది. లేదంటే వారు భయంకరమైన రాత్రిని చవిచూడాల్సి వచ్చేది" అని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు!

కాగా... 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు పుల్వామాలో సైనిక కాన్వాయ్‌ పై భీకర దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా బాలాకోట్‌ లో ఉగ్రశిబిరాలపై భారత సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. ఇందులో భాగంగా... బాలాకోట్‌ ఘటన జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాక్‌ వైమానిక దళం ఎఫ్‌-16 విమానంతో భారత్‌ పై దాడికి ప్రయత్నించింది. ఈ సమయంలోనే వింగ్‌ కమాండర్‌ గా ఉన్న అభినందన్‌ మిగ్‌-21 విమానంతో వెంటాడి దాన్ని నేలకూల్చారు.

అయితే ఆ సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో కిందకు దూకేశారు. ఆ సమయంలో ఆయన పాకిస్థాన్ భూభాగంలో పడ్డారు. దీంతో... ఆయనను అదుపులోకి తీసుకుని పాక్‌ జవాన్లు చిత్రహింసలు పెట్టారు. అనంతరం... అభినందన్‌ ను తిరిగి అప్పగించాలని భారత్‌ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాకిస్థాన్ అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్‌ కు అప్పగించింది.

Tags:    

Similar News