ఆ జిల్లాలో వైసీపీకి భారీ లోటు!
వైసీపీకి అసలే రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమయంలో వటవృక్షం గా ఉన్న సీనియర్ మోస్ట్ నేత ఇటీవల మరణించారు.
వైసీపీకి అసలే రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమయంలో వటవృక్షం గా ఉన్న సీనియర్ మోస్ట్ నేత ఇటీవల మరణించారు. దాంతో ఆ పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం. ఆయన పాత కాలం కాంగ్రెస్ నాయకుడు. ఆయన డెబ్బై దశకం నుంచి రాజకీయాలు చేస్తూ చూస్తూ వస్తున్నారు.
ఆయన పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అడుగు పెట్టని చోటు లేదు. సర్పంచ్ గా గెలిచి గ్రామ స్థాయి రాజకీయాల్లో అనుభవం సంపాదించారు. ఆ తరువాత ఆయన డెబ్బై దశకంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా నెగ్గారు. ఆరేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు.
మరో విశేషం ఏంటి అంటే 1994లో అన్న గారి రాజకీయ సునామీకి ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్ పునాదులు మొత్తం కదిలాయి. ఆ సమయంలో పాలవలస రాజశేఖరం ఒక్కరే శ్రీకాకుళం జిల్లా నుంచి గెలిచి వచ్చారు. అలా ఆయన మొనగాడు అనిపించుకున్నారు.
ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితులుగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్సార్ సీఎం గా ఉండగా ఆయన 2006 నుంది 2011 దాకా అయిదేళ్ళ పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ప్రభావం హెచ్చుగా ఉంటుంది. అలాంటి చోట ఆయన ఎదురు నిలిచి కాంగ్రెస్ ని గెలిపించారు.
వైఎస్సార్ మరణం తరువాత ఆయన వైసీపీలో చేరిపోయారు. అలా ఆయన చివరి వరకూ వైసీపీలోనే ఉండిపోయారు. ఆయన కుమార్తె పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఆమె 2019లో మంచి మెజారిటీతో గెలిచారు. ఇక కుమారుడు పాలవలస విక్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
జిల్లా రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న రాజశేఖరానికి పాతపట్నం, పాలకొండ, రాజాంలలో మంచి బలం బలగం ఉన్నాయి. ఆయన వైసీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. అటువంటి ఆయన మృతి చెందడడంతో వైసీపీకి జిల్లాలో గడ్డు కాలమే అని అంటున్నారు.
వైసీపీ ఇప్పటికే జిల్లాలో ట్రబుల్స్ ఎదుర్కొంటోంది. సీనియర్ నేతలు అంతా సైలెంట్ అయ్యారు. పార్టీలో ఎవరు ఏమిటి అన్నది తెలియకుండా ఉంది. వివిధ కారణాల వల్ల పార్టీలో పూర్తి స్తబ్దత ఆవరించింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మాజీ ఎంపీ రాజశేఖరం మరణం పార్టీ శ్రేణులను కృంగదీస్తోంది అంటున్నారు.
జిల్లాలో రాజకీయాలను మూడు బలమైన సామాజిక వర్గాలే శాసితూ వస్తున్నాయి. అందులో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రాజశేఖరం పూర్తిగా కాంగ్రెస్ ఫిలాసఫీకి కట్టుబడిపోయారు. ఆయన వారసులను కూడా అలాగే రాజకీయంగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు విక్రాంత్, కుమార్తె రెడ్డి శాంతి రాజకీయంగా వైసీపీకి బలమైన నేతలుగానే ఉన్నారు. రానున్న రోజులలో వైసీపీ మళ్లీ జిల్లాలో బలంగా పుంజుకోవాల్ని అంతా కోరుకుంటున్నారు.