పల్లాకు స్వాగతం పలుకుతున్న.. పార్టీ సవాళ్లు..!
ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకటించారు.
తెలుగు దేశం పార్టీ కొత్త అధ్యక్షుడిగా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు.. నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే పల్లా బాధ్యతలు తీసుకుంటారు. అయితే.. ఇప్పుడు.. పార్టీ అధికారంలోకి వచ్చిన దరిమిలా.. ఆయనపై కొంత మేరకు ప్రజెర్ తగ్గుతుంది. కానీ, కీలకమైన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. పార్టీని మరింత క్షేత్రస్థాయిలో విస్తరించాల్సి ఉంది.
ఇదే సమయంలో వైసీపీకి బలమైన కంచుకోటల్లో ఈ దఫా జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకుంది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి కూడాపరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే సందేహం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోకూడా.. పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. దీంతో కంచుకోటల్లో గెలిచాం కదా..అని అనుకుంటే సరిపోయేలా పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు పార్టీని అంచనా వేస్తూ.. ముందుకు సాగాలి.. బలోపేతం చేయాలి.
మరీముఖ్యంగా ప్రస్తుతం బీజేపీ-జనసేన పార్టీలతో టీడీపీ కలిసి.. అధికారం దక్కించుకుంది. ఇప్పుడు ఈ పార్టీల నాయకులను కూడా .. కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం పార్టీకి ఉంది. అయితే.. ఈ సమన్వయం బాధ్యతను చంద్రబాబు కానీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌లు నిర్వ హించే పరిస్థితి లేదు. మంత్రులుగా.. రాష్ట్ర బాధ్యతలు చూడాల్సిన అవసరం వారికి ఉంది. ఈ నేపథ్యం లో పార్టీని సమన్వయ పరిచే బాధ్యత నాయకులను సమష్టిగా నడిపించే బాధ్యత కూడా.. పల్లాపైనే ఉం టుంది.
మరోవైపు.. 2026 నాటికి.. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి. అప్పటికి క్షేత్రస్థాయిలో పార్టీని గెలిపించే బాధ్యత.. కూడా పల్లాపైనే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ కనీసం నామినేషన్లు కూడా వేయించే పరిస్థితి లేకుండా చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా.. అంరదినీ ఏకతాటిపైకి తీసుకురావడం.. కలసి కట్టుగా పార్టీని స్థానిక సంస్థల్లోనూ గెలిపించడం వంటివి పల్లాకు కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే. పల్లా పనితీరు.. కలుపుకొని పోయే విధానం.. సౌమ్యుడిగా ఆయనకు ఉన్న పేరు వంటివి చూస్తే.. వచ్చే రెండేళ్లు ఆయన చాలా కష్టపడకతప్పదని అంటున్నారు పరిశీలకులు.