తెలంగాణ సంప్రదాయ మద్యం కల్లు. గ్రామాల్లో ఇప్పటికీ.. సందర్భం ఏదైనా ఆడ, మగా.. తరచుగా పుచ్చుకునేది.. తాగి ఊగేది కల్లే! ఇప్పుడు ఇది.. ప్రభుత్వం తన పరిదిలోకి తీసుకునేందుకు రెడీ అయింది. ప్రభుత్వ కల్లు దుకాణాలు(బార్లు) ఏర్పాటు చేసేం దుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా వెల్లడించారు.
మహబూబ్‌నగర్‌లో జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు మారుతున్నాయని చెప్పారు. అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోందని.. వాటితో పాటు కల్లు గీత కార్మికుల వృత్తినీ ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా కల్లును కల్తీ లేకుండా గౌరవప్రదంగా అమ్మే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో త్వరలోనే ప్రభుత్వ కల్లు దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు తెలిపారు.
ఈ దుకాణాల్లో వృత్తి దారులు నేరుగా తాము తీసిన కల్లును విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై ఎలాంటి డ్యూటీలు వేయబోమని.. ప్రస్తుతానికి తమకు ఆ ఆలోచన కూడా లేదని పొన్నం వివరించారు. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 90 రోజులైందని పొన్నం చెప్పారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీకి కట్టుబడి 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా చేశామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉండాలని ఆదిశగా ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు.