ఇద్దరు పంచకర్లలు... పంచ్ పడేదెవరికో...!
ఇద్దరు పంచకర్లలు కాపులే అని అంటున్నారు. ఇంతకీ ఈ ఇద్దరూ చుట్టాలు కాదు కదా అన్నది మరో చర్చ.
ఒకే పేరు గలవారు చాలా మందే ఉండవచ్చు. కానీ ఒకే జిల్లాలో ఒకే పార్టీలో ఉండడం అంటే విశేషమే అని చెప్పుకోవాలి. జనసేనలో ఒక పంచకర్ల 2019 నాటికే ఉన్నారు. . ఆయనే భీమునిపట్నానికి చెందిన పంచకర్ల సందీప్. ఆయన ఆ ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి పోటీ చేసి దాదాపుగా పాతిక వేల దాకా ఓట్లను రాబట్టారు.
ఇక 2024 ఎన్నికలకు కూడా ఆయన ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. ఇక మరో పంచకర్ల ఇపుడు ఆయనకు జత అయ్యారు. జనసేనలో కొత్తగా చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఈయన గతంలో ప్రజారాజ్యం టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పెందుర్తి, యలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచారు.
అయితే 2019లో ఆయన ఎలమంచిలిలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2024లో గెలవాలని ఆయన చూస్తున్నారు కానీ ఆయన కోరుకున్న సీటు తో పాటు టికెట్ కావాలి. అందుకే వైసీపీ అధికారంలో ఉన్నా దాన్ని వదిలేసి మరీ జనసేనలో చేరిపోయారు. ఆయన పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఆయన ఎలమంచిలి టికెట్ ఆశించినా అది దక్కే సీన్ లేదు.
అక్కడ ఆల్ రేడీ జనసేన నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి 18 వేల ఓట్లు తెచ్చుకున్న సీనియర్ జనసేన నాయకుడు సుందరపు విజయకుమార్ ఉన్నారు. సో పెందుర్తిలోనే ఆయనకు ఎంతో కొంత ఆశ ఉంది. కానీ పెందుర్తిలో బిగ్ లీడర్ గా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు.
ఆయనను కాదనే శక్తి బాబుకు ఉంటుందా అన్నదే చర్చ. పంచకర్ల వియ్యంకుడే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. ఆయన బండారుకు ఎవరూ అడ్డు రాకుండా చక్రం వేస్తారు అని అంటున్నారు. అయితే అవతల వైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన జనసేనలో పంచకర్ల రమేష్ బాబు చేరడానికి పెందుర్తి టికెట్ హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది.
అసలు ఆ హామీ పుచ్చుకున్న మీదటనే పంచకర్ల జంప్ అయ్యారని అంటున్నారు. మరి పొత్తులలో భాగంగా ఆ సీటు కావాలని జనసేన పట్టుబడితే నో అనే సీన్ ఉంటుందా అన్నది మరో చర్చ. అయితే ఇక్కడే సమీకరణలు రాజకీయాలు ముందుకు వస్తున్నాయి. ఎపుడో అంటే ఇప్పటికి 15 ఏళ్ళ క్రితం పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా చేసిన పంచకర్ల రమేష్ కి అక్కడ పట్టు ఏమీ లేదని అంటున్నారు.
ఆయనది నిలకడ లేని రాజకీయమని ఇప్పటికి ప్రజారాజ్యం కాంగ్రెస్, టీడీపీ వైసీపీ ఇలా నాలుగు పార్టీలను మారారని, ఇపుడు అయిదవ పార్టీగా జనసేనలోకి వచ్చారని అంటున్నారు. ఆ పార్టీలో ఆయనకు పట్టు లేదని, పెందుర్తిలో ఉన్న జనసేన నాయకుల మద్దతు కూడా పెద్దగా లేదని అంటున్నారు.
మరో వైపు చూస్తే పంచకర్లకు పెందుర్తిలో టికెట్ ఇచ్చినా గెలుపు అవకాశాలు ఎంత అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తానికి పంచకర్ల రమేష్ పెందుర్తిలో తమ్ముళ్లకు దడ పుట్టిస్తున్నారు. అలాగే భీమిలీలో మరో పంచకర్ల టీడీపీ ఆశావహులకు ట్రబుల్ ఇస్తున్నారు. చిత్రమేంటి అంటే ఒకే ఇంటిపేరు ఒకే జిల్లా ఒకే పార్టీ మాత్రమే కాదు ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే.
ఇద్దరు పంచకర్లలు కాపులే అని అంటున్నారు. ఇంతకీ ఈ ఇద్దరూ చుట్టాలు కాదు కదా అన్నది మరో చర్చ. అయినా ఒక ఇంటిపేరు గల ఇద్దరు పంచకర్లకు ఎలా టికెట్ ఇస్తారమ్మా అంటూ టీడీపీలోనూ జనసేనలోనూ చర్చ అయితే సాగుతోంది. మరి పంచకర్ల ద్వయం చేసే రాజకీయాలు వేసే పంచులు ఎలా ఉంటాయో రానున్న కాలమే తేల్చి చెప్పాల్సి ఉంది.