ప్రియాంకాగాంధీకి పోటీగా కవిత... ఈటెల రాజేందర్...?
ఇదిలా ఉంటే మెదక్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది
ప్రస్తుతానికి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇక వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండూ ఎంపీ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఉంది. ఇక బీజేపీ తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. దాంతో ఈ రెండు పార్టీల టార్గెట్ పార్లమెంట్ ఎన్నికల మీదనే ఉంది.
ఇదిలా ఉంటే మెదక్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఈ మెరకు కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ప్రియాంకా గాంధీ ఇంకా ఈ విషయంలో డిసైడ్ చేసుకోలేదు అని అంటున్నారు.
మరో వైపు సోనియా గాంధీ 2024లో పోటీకి దూరంగా ఉంటే ప్రియాంకా గాంధీ తన తల్లి సీటు అయిన రాయబరేలీ పోటీ చేయవచ్చు అన్న ప్రచారమూ ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
రాజకీయ సమీకరణలు వ్యూహాలు కాంగ్రెస్ మార్చుకుని సోనియా గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తే మాత్రం ప్రియాంకా గాంధీ మెదక్ నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఇక దే జరిగితే మెదక్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీకి దిగితే ఆమెకు ప్రత్యర్థిని బీఆర్ఎస్ అపుడే రెడీ చేసి పెట్టింది అని అంటున్నారు. అది ఎవరో కాదు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ అయిన కవిత అని అంటున్నారు.
కవిత 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు చూస్తే నిజమాబాద్ ఎంపీ సీటులో బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు రాజకీయంగా లేవు అని అంటున్నారు. ఎందుకు అంటే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అక్కడ పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయని అంటున్నారు
దాంతో నిజామాబాద్ లో బీఆర్ఎస్ కి గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని పార్టీ అంచనా కడుతోంది. అదే టైం లో మెదక్ లో ఇప్పటికి మూడు సార్లు బీఆర్ఎస్ గెలిచింది. అంతే కాదు ఒక విధంగా కంచుకోటగా ఆ పార్టీకి ఉంది. తాజా ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ గెలిచింది అని గుర్తు చేస్తున్నారు.
మెదక్ ఎంపీ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ వంటి ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ గెలిచింది. హరీష్ రావు అయితే 85 వేల పై చిలుకు భారీ ఆధిక్యంతో గెలిచారు. కాబట్టి కవిత కనుక పోటీకి దిగితే మెదక్ ఎంపీ సీటు చాలా సేఫ్ అని బీఆర్ఎస్ లో టాక్ నడుస్తోందిట.
అయితే కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలో ఉంది. మరో నాలుగు నెలల్లో జరిగే ఎంపీ ఎన్నికల్లో ఇదే రకంగా తన జోరుని కొనసాగించవచ్చు. పైగా ప్రియాంకా గాంధీని నిలబెడితే ఆ ఊపు వేరే విధంగా ఉండవచ్చు. మొత్తం కాంగ్రెస్ ఫోకస్ కూడా అక్కడే ఉంటుంది. దాంతో అపుడు కవితకు ఆ సీటులో గెలుపు కొంత కష్టం కావచ్చు అని కూడా అంటున్నారు.
మరో వైపు చూస్తే బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ కూడా మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఇప్పటికే గజ్వేల్ లో కేసీఆర్ మీద పోటీ చేసి బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. దాంతో ఎమ్మెల్యేగా ఓడిన ఈటెల ఎంపీ మీద గురి పెడుతున్నారు అని అంటున్నారు. అలాగే కరీంనగర్ నుంచి మరోసారి ఎంపీగా బండి సంజయ్ పోటీ చేస్తారు అని అంటున్నారు.
ఈటెల సొంత అసెంబ్లీ సీటు కరీం నగర్ పరిధిలో ఉంది. కానీ బండి సంజయ్ అక్కడ నుంచి పోటీ చేయడం దాంతో ఈటెలకు మెదక్ కంటే ఆప్షన్ వేరేది లేదు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అటు ప్రియాంకా గాంధీ ఇటు కవిత అలాగే ఈటెల పోటీలో ఉంటే మెదక్ ఎంపీ సీటు 2024 ఎన్నికల్లో మారుమోగడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.