నేటితో చరిత్రలో కలిసిపోనున్న పార్లమెంటు హిస్టరీ!!
దీంతో పాత పార్లమెంటు భవనం ఇక, చరిత్రగా మారనుంది. ఈ నేపథ్యంలో పాత పార్లమెంటు భవనం విశేషాలు ఆసక్తిగా మారాయి.
భారత దేశ ప్రజల అభ్యున్నతి కోసం.. అనేక చట్టాలు చేసిన పార్లమెంటు, ఎంతో మంది మేధావులు, విజ్ఞులు ప్రజల కోసం గళం వినిపించిన పార్లమెంటు.. నేటితో చరిత్రలో కలిసిపోనుంది. వర్తులాకారంలో రాజసం ఉట్టిపడేలా ఉండే.. భారత పార్లమెంటు భవనం నేటితో పని ముగించనుంది. రేపటి నుంచి(మంగళవారం) నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు సాగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహం ప్రకారం.. నేడు పాత పార్లమెంటు భవనంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు సహా పార్లమెంటు సేవలపై ప్రత్యేక చర్చ సాగుతుంది.
అనంతరం.. మంగళవారం నుంచి కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పాత పార్లమెంటు భవనం ఇక, చరిత్రగా మారనుంది. ఈ నేపథ్యంలో పాత పార్లమెంటు భవనం విశేషాలు ఆసక్తిగా మారాయి.
సుమారు 96 ఏళ్ల కిందట ఈ పార్లమెంటు భవనాన్ని అప్పటి బ్రిటీష్ పాలకులు నిర్మించిన విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు.. అప్పట్లో నిర్మించిన ఈ భవనం ఎంత పటిష్టమంటే.. ఇప్పటి వరకు ఎన్ని ప్రకృతి విలయాలు సంభవించినా.. చెక్కు చెదరకుండా ఠీవీగా నిలిచింది.
ఢిల్లీలోని రైసీనా హిల్ ప్రాంతంలో ఉన్న పాత పార్లమెంటు(ఉభయ సభలు) భవనాన్ని1927 జనవరి 18న అప్పటి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ భవనానికి 144 రాతి స్తంభాలు ఉన్నాయి. బ్రిటీష్ పాలకులు దీనికి ‘కౌన్సిల్ హౌస్’ అని పేరు పెట్టారు. పార్లమెంటు భవనం ప్లానింగ్ అంతా కూడా బ్రిటన్‌లో జరిగిందని చెబుతారు. దీనికి సంబంధించి ఆర్టిటెక్ట్స్ సర్ హెర్బెర్ట్ బేకర్, సర్ ఎడ్విన్ లుట్యెన్స్ రూపొందించారు.
ఇప్పటికీ పార్లమెంటు తలుపులు తెరిచేందుకు బంగారంతో తయారు చేసిన తాళం చెవులనే వినియోగిస్తారనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ తాళం చెవులను కూడా బ్రిటీష్ హయాంలోనే రూపొందించారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన భవంతుల్లో ఒకటిగా నిలిచిన భారత పార్లమెంటు భవనంలో చిట్ట చివరి సమావేశాలు నేడు(సోమవారం) జరగనున్నాయి.