విడాకుల కేసును మూడేళ్లు నడిపిన చిలుక!
మహారాష్ట్రకు చెందిన ఒక జంట పెళ్లైన కొంతకాలానికి విభేదాలు మొదలయ్యాయి. దీంతో.. వారిద్దరు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
విడాకుల కేసులు ఎన్నో విని ఉంటారు. ఇప్పుడు చెప్పేది రోటీన్ కు పూర్తి భిన్నమైన కేసుగా చెప్పాలి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న జంట.. కోర్టుకు వచ్చిన తర్వాత చిలుక కారణంగా మూడేళ్ల పాటు వారి విడాకుల కేసు ముందుకు కదలని పరిస్థితి. ఇంతకీ వారి విడాకుల కేసు తేలకపోవటానికి చిలుక ఎలా కారణం? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
మహారాష్ట్రకు చెందిన ఒక జంట పెళ్లైన కొంతకాలానికి విభేదాలు మొదలయ్యాయి. దీంతో.. వారిద్దరు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఫుణెలోని ప్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన జంటలకు ఏ రీతిలో అయితే కౌన్సెలింగ్ ఇస్తారో.. సదరు జంటకు ఇచ్చినప్పటికీ విడిపోయేందుకే మొగ్గు చూపారు. తాము కలిసి ఉండలేమని స్పష్టం చేశారు.
అయితే.. విడాకుల వేళ.. సదరు భర్త ఒక కండీషన్ పెట్టాడు. పెళ్లికి ముందు తాను ప్రేమకానుకగా ఇచ్చిన ఆఫ్రికన్ గ్రే చిలుకను తనకు తిరిగి ఇచ్చేయాలని.. అప్పుడు మాత్రమే తాను విడాకులకు ఓకే చెబుతానని కండీషన్ పెట్టాడు. అందుకు ఆమె మాత్రం ససేమిరా అంది. తాను ప్రేమగా చూసుకునే ఆఫ్రికన్ చిలుకను తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో.. మూడేళ్లుగా వారి విడాకుల కేసు పెండింగ్ లోనే ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా తాను చిలుకను తిరిగి ఇచ్చేస్తానని ఆమె చెప్పటంతో.. ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి.