భారత జట్టు కోసం ప్రయాణికుల ఎయిరిండియా విమానం రద్దు.. రగడ.. రగడ..

టి20 ప్రపంచ కప్ లో శనివారం సాయంత్రమే (వెస్టిండీస్ కాలమానం ప్రకారం) ఫైనల్ మ్యాచ్ పూర్తయింది.

Update: 2024-07-04 11:25 GMT

టి20 ప్రపంచ కప్ లో శనివారం సాయంత్రమే (వెస్టిండీస్ కాలమానం ప్రకారం) ఫైనల్ మ్యాచ్ పూర్తయింది. దీంతో ఆ రాత్రికో, ఆదివారం ఉదయమో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు స్వదేశానికి బయల్దేరాల్సి ఉంది. ఈ లెక్కన ఆదివారం సాయంత్రం లేదా రాత్రికి భారత్ కు చేరుకునేది. ఒక రోజు ఆలస్యంగా బయల్దేరారు అనుకుంటే సోమవారం సాయంత్రానికికైనా వచ్చేసేది. కానీ, గురువారం తెల్లవారుజాము దాకా రాలేకపోయింది. దీనికి కారణం బార్బడోస్ లో భీకర తుఫాను బెరిల్.

మూడు రోజులు అక్కడ..

తుఫాను తీవ్రత కారణంగా ఆదివారం నుంచి బార్బడోస్ రాజధాని బ్రిడ్జిటౌన్ లోనే భారత జట్టు ఉండిపోయింది. దీంతో జింబాబ్వే టూర్ కు ఎంపికైన ముగ్గురు క్రికెటర్లూ అటు వెళ్లలేక పోయారు. ఇక భారత జట్టు బ్రిడ్జిటౌన్ లోనే బుధవారం వరకు గడిపింది. బ్రిడ్జిటౌన్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో తిరిగి వచ్చే మార్గం లేకపోయింది. అనంతరం మన ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో టీ20 వరల్డ్‌ కప్‌ తో బయల్దేరింది. గురువారం తెల్లవారుజామున ఢిల్లీలో దిగింది. అయితే, భారత జట్టు కోసం పంపినది ఎయిరిండియాకు చెందిన విమానం. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం వివాదంగా మారింది.

Read more!

ప్రయాణికుల విమానమా?

ప్రత్యేక విమానాలంటే ప్రత్యేకమే. కొందరి కోసం ఉద్దేశించినవి అని అర్ధం. కానీ, భారత జట్టును తీసుకొచ్చేందుకు ప్రయాణికుల కోసం కేటాయించిన విమానాన్ని వాడారని కథనాలు వచ్చాయి. ప్రయాణికుల విమానాన్ని రద్దు చేసి బార్బడోస్‌కు పంపారని దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఎయిరిండియాను ఆదేశించింది. కాగా, భారత క్రికెటర్లు వచ్చిన విమానం అమెరికాలోని నెవార్క్‌ నుంచి ఢిల్లీకి రావాల్సినదా..? దానిని భారత జట్టు కోసం పంపారా?’ అని ఆరా తీసింది. కాగా, ఎయిరిండియా అధికారి స్పందిస్తూ.. బార్బడోస్‌ కు విమానం పంపడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులకు ముందే తెలియజేసినట్లు వివరించారు. అయినప్పటికీ.. కొంతమంది నెవార్క్‌ కు రాగా.. వారిని న్యూయార్క్‌ కు బస్సులో తీసుకెళ్లినట్లు చెప్పారు. మరో విమానంలో ఢిల్లీకి వచ్చే చూశామన్నారు. అంటే.. భారత జట్టు కోసం ప్రయాణికుల విమానాన్ని వినియోగించారని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News

eac