కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

ఇప్పటికే ఈ కేసులో పలువురు పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు తాజాగా.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను సైతం అరెస్ట్ చేశారు.

Update: 2024-11-13 04:07 GMT

వికారాబాద్ జిల్లాలో కలెక్టర్‌పై దాడి కేసులో సంచలనం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు. తాజాగా.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను సైతం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు..? ఇంకా ఎంత మంది అరెస్ట్ కాబోతున్నారు..? అన్న ఆసక్తి నెలకొంది.

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో 1,350 ఎకరాల్లో ఇంటస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ముందుగా ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. దీనికి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో తన నిర్ణయాన్ని చేంజ్ చేసుకొని ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం.. సోమవారం దుద్యాలలో అధికారులు గ్రామసభ, ప్రజాభిప్రాయ సేకరణకు దిగారు.

ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు రగచర్ల గ్రామానికి వెళ్లారు. అభిప్రాయ సేకరణ ప్రారంభం కాకముందే పలువురు గ్రామస్తులు అధికారులపై దాడులకు దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ వాహనం అద్దాలు పగలగొట్టారు. అయితే.. ఈ కేసులో బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. మరోవైపు.. ప్రజలను రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్‌పై దాడికి ఉసిగొల్పిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అయిన సురేశ్‌గా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ దాడి జరగడానికి ముందే పట్నం నరేందర్ రెడ్డితో సురేశ్ 40 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ సురేశ్‌పై పలు కేసులు నమోదు కాగా.. వాటిని తొలగించే విషయంలో పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి

ఇక.. కలెక్టర్‌పై దాడి కేసులో ఈ రోజు ఉదయం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిలింగనర్‌లో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటికే కలెక్టర్ మీద దాడి విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో పరిస్థితి మరింత వాడివేడిగా మారిపోయింది. మరోవైపు.. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ తమపై కుట్ర పన్నుతోందని గులాబీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News