'లడ్డూ'.. పవన్ కు ఎప్పుడూ వర్కువుట్ కాదా?

మొదట్లో బ్రహ్మాండమైన ఇమేజ్ వచ్చినట్లే వచ్చి.. ఆ తర్వాత దెబ్బ తీస్తుంది.

Update: 2024-10-15 09:30 GMT

ఫలానా కారణం అని చెప్పలేం కానీ.. కొందరికి కొన్ని అంశాలు అస్సలు వర్కువుట్ కావు. వారెంతగా ప్రయత్నించినా.. ఫలితం రాకపోగా ఎదురుదెబ్బలు తగిలే పరిస్థితి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ కు సైతం ఇలాంటిదే వర్తిస్తుంది. ఆయన నోటి నుంచి వచ్చే లడ్డూ మాట ఆయన ఇమేజ్ ను పెంచే కన్నా.. డ్యామేజ్ చేయటమే ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి పవన్ నోటి నుంచి వచ్చే లడ్డూ మాట రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతుంది. మొదట్లో బ్రహ్మాండమైన ఇమేజ్ వచ్చినట్లే వచ్చి.. ఆ తర్వాత దెబ్బ తీస్తుంది.

కొన్నేళ్ల క్రితం బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడ్ని ఉద్దేశించి హోదాను పాచిపోయిన లడ్డూతో పోలుస్తూ.. బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన ఎటకారం.. ఆవేశపూరిత వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఆ తర్వాతి కాలంలో ఈ వ్యాఖ్యలపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే..పాచిపోయిన లడ్డూ వ్యాఖ్యలతో పవన్ ఇమేజ్ ప్రజల్లో పెరిగితే.. రాజకీయ వర్గాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. దీనికి కారణం.. సూపర్ హిట్ అయిన పాచిపోయిన లడ్డూ వ్యాఖ్యల్ని ఆ తర్వాత పవన్ నోటి నుంచి రావటం ఆగిపోవటమే.

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ. పాచిపోయిన లడ్డూల మాటేంటి? అంటూ ఆయన్ను ఎంత ఎటకారం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాచిపోయిన లడ్డూ మాటలోని ఫోర్సు బాగానే ఉన్నా.. దాని కారణంగా తనకు ఎదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఆ మాటను మాట్లాడితే ఒట్టు అన్నట్లుగా మారింది. పవన్ ను ప్రశ్నించాలనుకునే రాజకీయ ప్రత్యర్థులు.. ఆయన్ను ఇరుకున పెట్టేందుకు పాచిపోయిన లడ్డూ మాటల్ని ప్రస్తావించటం కనిపిస్తుంది.

పాచిపోయిన లడ్డూలంటూ మోడీ సర్కారుపై నిప్పులు చెరిగిన పవన్.. ఆ తర్వాత నుంచి ఆ ఇష్యూను మాట్లాడటం మానేశారు. కట్ చేస్తే.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి లడ్డూ అంశాన్ని టేకప్ చేశారు పవన్ కల్యాణ్. ఈసారి కూడా ఆయనకు ఎదురుదెబ్బలు తప్పట్లేదు. పవన్ లాంటి క్లీన్ చిట్ ఉన్న రాజకీయ అధినేత ఒక అంశాన్ని టేకప్ చేసినప్పుడు 360 డిగ్రీస్ లో ఆ అంశాన్ని చూడటం.. తాను ఏ అంశాన్ని అయితే ఫోకస్ చేస్తున్నాడో.. దానికి సంబంధించిన అంశాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.

తాను లేవనెత్తిన అంశానికి సంబంధించిన ప్రశ్నల్ని తానే ఆన్సర్ చేసేలా వ్యవహరిస్తే.. విమర్శలు తగ్గే వీలుంటుంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. లడ్డూ ఎపిసోడ్ లో పవన్ అండ్ కో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఉప ప్రశ్నలు ఇప్పుడు ప్రముఖంగా మారి.. వాటికి ఆన్సర్లు చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదంతా చూసినప్పుడు.. లడ్డూలు.. ఎప్పుడూ పవన్ కు కలిసి వచ్చేలా లేవన్న భావన కలుగక మానదు. ఈసారి లడ్డూ రిలేటెడ్ ఇష్యూస్ ను టేకప్ చేసే వేళలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News