బీజేపీ బేఫికర్.. దక్షిణాదిన రాజకీయ `హీరో`
దక్షిణాది రాష్ట్రాల్లో వేళ్లూనుకోవాలన్న బీజేపీ కలలకు మరింత బలమైన రెక్కలు వచ్చాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో వేళ్లూనుకోవాలన్న బీజేపీ కలలకు మరింత బలమైన రెక్కలు వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమ వాణిని, బాణిని బలంగా వినిపించే నేతలు.. కమల నాథులకు చేరువయ్యారు. నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం తెరమీదికి వచ్చిన తర్వాత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చేసిన ప్రాయశ్చిత్త దీక్ష, అనంతరం, ఆయన వారాహి బహిరంగ సభలో చేసిన కామెంట్లు వంటివి బీజేపీకి బలంగా మారాయి.
ఒక్క ఏపీలోనే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలోనూ మరింత బలం చేకూరుతోందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే.. పవన్ సొంతగాపార్టీ పెట్టుకున్న నాయకుడు. అయినా.. బీజేపీతో ఆయన స్నేహం దాదాపు పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2014 నుంచి ఇప్పటివరకు మధ్యలో కొద్దిపాటి విరామం మినహా.. బీజేపీతోనే పవన్ ఉన్నారు. దీంతో ఆయనను బీజేపీ నుంచి విడదీసిచూడలేమన్నది జాతీయ మీడియా చెబుతున్న మాట.
తాజాగా ఆయన తిరుమల లడ్డూపై మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకున్నారు. దీనిని పరిరక్షించేందుకు.. తన పదవిని జీవితాన్ని కూడా వదులు కుంటానని వ్యాఖ్యానించారు. అదేసమయం లో పొరుగున ఉన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిని కూడా ఏకేశారు. ఇక, తెలంగాణ రాజకీయాలను కూడా పవన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కుహనా లౌకిక వాదులు అంటూ అక్కడి ప్రతిపక్ష నేతలను దుయ్యబట్టారు. అదేసమయంలో అధికార పక్షం కాంగ్రెస్ ను కూడా తిట్టిపోశారు. పేరు చెప్పకుండానే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
నిజానికి ఇంత బలంగా హిందూత్వను భుజాన వేసుకున్న నాయకుడు బీజేపీకి లభించలేదు. బండి సంజయ్ వంటివారు ఉన్నా.. వారికి ఇంత బలమైన ఫాలోయింగ్ కూడా లేదు. ఇక, తమిళనాడులో మాజీ ఐపీఎస్ అన్నామలై బీజేపీకి చీఫ్ ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున హిందూత్వను నెత్తిన పెట్టుకోలేదు. ఇక, కర్ణాటకలోనూ నాయకులు వృద్ధ నేతలే ఉన్నారు. దీంతో వారు అటు ఇటు గా నే మాట్లాడుతున్నారు. కేరళ పరిస్థితి చెప్పడం ఎంతైనా తక్కువే. అక్కడ అసలు హిందూత్వను మాట్లాడే వారే తక్కువ.
సో.. ఈ పరిణామాల నేపథ్యంలో తమ అత్యంత విశ్వసనీయ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ ఇలా.. హిందూత్వను భుజాన వేసుకోవడం రాబోయే రోజుల్లో బీజేపీకి బలమైన మద్దతుగా మారుతుందని జాతీయ మీడియా అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.