వరద వేళ పవన్ కల్యాణ్ ఎక్కడ?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడి రోజుల్లో గంటల తరబడి అధికారులతో గడుపుతూ.. తాను ప్రాతినిధ్యం వహించే పంచాయితీ రాజ్ శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన అంశాల్ని ఆయన పర్యవేక్షిస్తుంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన అనునిత్యం ప్రజల్లో ఉండటం కనిపిస్తుంది. అలాంటి పవన్ కల్యాణ్.. ఏపీని భారీ వర్షాలు ముంచెత్తి.. అతలాకుతలం చేస్తున్న వేళలో ఆయన జాడ లేకపోవటం తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో సహా పలువురు నేతలు వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్న వేళ.. పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించలేదు. ఈ రోజు (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లారా? అన్నది ప్రశ్నగా మారింది. వరదలు లాంటి సమాయాల్లో.. అందునా ఏపీ మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న వేళలో ఆయన జాడ లేకపోవటం చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ బయటకు వెళ్లి ఉంటే.. తాను అందుబాటులో లేని విషయాన్ని తెలియజేయటం.. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించటం లాంటివి చేయొచ్చు. తన టూర్ ను అర్థంతరంగా ఆపేసుకొని తిరిగి వచ్చేయొచ్చు. కానీ.. ఆయన ఎక్కడకు వెళ్లారో? ఏం చేస్తున్నారో? అర్థం కాని పరిస్థితి. ఆపత్ కాలంలో అందరికి అందుబాటులో ఉండి.. ముందుండి నడిపించాల్సిన పవన్ ఎక్కడా కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది. తన పుట్టినరోజైన సోమవారమైనా ఆయన బయట కనిపిస్తారో? లేదో? చూడాలి.