వైసీపీ రాజకీయ జాతకం చెప్పిన పవన్ ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి పదికాలాలు ఏపీలో అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి పదికాలాలు ఏపీలో అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి అలాగే అనుకోవాలి. అయితే ఎప్పటికీ ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదా అదేనా పవన్ అభిప్రాయం అంటే ఆ విధంగానే ఆయన ఆలోచనలు మాటలు ఉన్నాయని అంటున్నారు.
వరదల గురించి చెరువులు ఏరుల వద్ద అక్రమణ నిర్మాణాల గురించి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వాలు మారినా కూడా వరదలు మళ్లీ రాకూడదని, రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా పటిష్టమైన చర్యలు ఇప్పటి నుంచే తీసుకుంటేనే బాగుంటుంది అని పవన్ అన్నారు.
అంతలోనే ఆయన నాలిక కరచుకుని రేపు ఎవరో రావడం ఏమిటి మరో పది ఇరవై ఏళ్ళు అయినా కూటమే అధికారంలో ఉంటుంది అని సర్దుకున్నారు. దాంతో అక్కడే ఉన్న వారు అంతా దీని మీదనే చర్చించుకున్నారు. 2029లో వైసీపీ ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఆ దిశగానే ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు
అయితే పవన్ మాత్రం ఇప్పటి నుంచి రెండు దశాబ్దాలు అంటే 2044 వరకూ ఏపీలో సీఎం సీటు ఖాళీ లేదు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. బుడమేరు అక్రమణల మీద కఠినంగా వ్యవహరిస్తామని పవన్ అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి.
ఆక్రమణల మీద కఠినంగా ఉండాల్సిందే అని పవన్ అంటున్నారు. లేకపోతే మరో ప్రభుత్వం వచ్చినా అంటూ ఆయన మరో ప్రభుత్వం వచ్చే సమస్యే లేదని అనడం పట్ల సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మరి పవన్ వ్యాఖ్యలతో వైసీపీకి నిరాశ అయితే కలగవచ్చు. కానీ కూటమి ఎప్పటికీ అధికారంలో ఉండాలని పవన్ అనడం కూడా చిత్రమే. ఆ వెంటనే మనిషి ఆశావాది కదా అని పవన్ మరో మాట కూడా అన్నారు.
అంటే అలా కూటమి ప్రభుత్వమే ఎప్పటికీ అధికారంలో ఉండాలని పవన్ కోరుకుంటున్నారు అని అంటున్నారు. అదే అయితే కూటమి ప్రభుత్వంలో జనసేన పరిస్థితి ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. కూటమి ప్రభుత్వమే ఉంటే టీడీపీయే ఎప్పటికీ అధికారంలో కీలకంగా ఉంటుంది. మరి పవన్ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న వారి ఆశలు కూడా ఏమి కావాలని అంటున్న వారూ ఉన్నారు.
అయితే కూటమి అంటే జనసేన కూడా ఏదో నాటికి అధికారం చేపడుతుంది అన్నదే పవన్ భావన అని ఆ విధంగా టీడీపీ జనసేన తప్ప వైసీపీకి అసలు చాన్సే లేదని పవన్ తేల్చేసారా అన్న చర్చ సాగుతోంది. మరి వైసీపీకి 2029 ఎన్నికల్లోనే కాదు మరో నాలుగు ఎన్నికల్లోనూ అధికారం దక్కకపోతే ఎలా అన్నదే చర్చ. మరి పవన్ చెప్పిన వైసీపీ రాజకీయ జాతకం ఫ్యాన్ పార్టీని కుదురుగా ఉండనిస్తుందా అన్నదే అసలైన చర్చ.