పవన్ - తమిళనాడు- బీజేపీ... !
సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనూహ్యంగా తమిళనాడుపై దృష్టి పెట్టారు. నిజంగానే ఇది అనూహ్యమైన సంఘటన. ఎవరూ ఊహించలేదు కూడా. సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చారంటూ.. ఆ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిని పవన్ నేరుగా టార్గెట్ చేసుకున్నారు. అయితే.. వాస్తవానికి ఆయన తాత, మాజీ సీఎం కరుణానిధి కూడా అనేక సందర్భంగాల్లో రాముడు లేడు.. రాక్షసుడు లేడు.. రామాయణం బూటకం అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఒక్క తమిళనాడే కాదు.. కర్ణాటక, గోవా, కేరళలోనూ సనాతన ధర్మాన్ని విమర్శించేవారు.. ప్రసాదాన్ని కూడా పలహారంగా భావించే నాయకులు ఉన్నారు. అయితే.. తమిళనాడు మాత్రమే పవన్ ఎందుకు టార్గెట్ చేసుకున్నారన్నది ప్రశ్న. నిరంతరం.. ఆయన ఇటీవల తమిళనాడులో హైందవం విలసిల్లిందని.. రుషులు, యోగుల భూమిగా ఆ రాష్ట్రం వినుతికెక్కిందని చెప్పుకొచ్చారు. ఇలా పవన్ పదే పదే తమిళనా డులో హిందూత్వను ప్రోత్సహించేలా మాట్లాడడం వెనుక రీజనేంటి? అనేది చర్చ.
వచ్చే 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ ఈ లోగా జమిలికి రాష్ట్రాలు జై కొడితే.. 2027లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలా చూసుకున్నా.. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే వీక్‌గా ఉంది. ఈ గ్యాప్‌ను తాము అందిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అన్నామలైని రంగంలోకి దింపింది. ఆయన ఆయన ఊపు సరిపోవడం లేదు. లౌకిక వాదిగా ఆయన ముద్ర వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్‌ను.. లడ్డూ వివాదం నేపథ్యంలో వ్యూహా త్మకంగా బీజేపీ పెద్దలే తమిళనాడును ఫోకస్ చేసేలా.. హిందూత్వను తమకు అనుకూలంగా మార్చుకు నేలా ప్రయత్నిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పవన్‌కల్యాణ్‌కు అక్కడ పార్టీ లేక పోవచ్చు. ఆయన నేరుగా బీజేపీకి ప్రచారం చేయకపోవచ్చు. కానీ, ఆయన వ్యాఖ్యలు తమకు అంతర్గతంగా తమిళనాడులో ఉపయోగపడతాయన్న ఆలోచనలో కమల నాథులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే.. పవన్‌ను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.