ఆదివారం అర్థరాత్రి 1 గంటకు పవన్ ట్వీట్.. ఏముందంటే?
ఏదైనా జరిగితే వెంటనే స్పందించే పవన్ కల్యాణ్.. తాజా ఎపిసోడ్ లో కనిపించకుండా ఉండటానికి కారణం ఏమిటన్నది బయటకురాలేదు.
ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఏపీ వ్యాప్తంగా కురిసిన భారీవర్షాలు ఒక ఎత్తు అయితే.. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి.. నగరం పెద్ద నదిలా మారిపోవటం తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలకు గురైన దుస్థితి. కొన్ని వేల కుటుంబాల వారు వరదలో చిక్కుకుపోయిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం తపించిన పరిస్థితి. ఇలాంటి వేళ.. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ కనిపించకపోవటం.. ఆయన ఉనికి ఎక్కడన్న ప్రశ్న తలెత్తింది.
ఏదైనా జరిగితే వెంటనే స్పందించే పవన్ కల్యాణ్.. తాజా ఎపిసోడ్ లో కనిపించకుండా ఉండటానికి కారణం ఏమిటన్నది బయటకురాలేదు. ఆదివారం మొత్తం ఆయన కానీ ఆయన సోషల్ మీడియా ఖాతాలో కానీ ఎలాంటి పోస్టులు లేవు. దీనికి భిన్నంగా ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వేళలో ఆయన ఒక పోస్టు పెట్టారు. ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. వరద ప్రభావంపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం హ్యాండిల్ లో ఒక పోస్టు చేశారు. అందులో ఏముందన్నది యథాతధంగా చూస్తే..
- ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. ప్రతి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, జిల్లా పరిషత్తుల్లో అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
- మండల స్థాయి, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తక్షణ స్పందనకు బృందాలు సిద్ధంగా ఉంచారు. ప్రతి 6 గంటలకు ఒకసారి టెలీ కాన్ఫరెన్సుల ద్వారా అన్ని జిల్లాల బృందాలతో పర్యవేక్షణ, సమన్వయం చేసుకోవడం నిరంతరాయంగా కొనసాగుతుంది.
- ప్రభావిత ప్రాంతాల కోసం 300 ప్రత్యేక బృందాలకి అవసరమైన సిబ్బందినీ, వారికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేయడమైనది. ప్రతి బృందంలో ముగ్గురు పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సంబంధిత పరికరాలు (హై ప్రెషర్ క్లీనింగ్ యంత్రాలు, కత్తెరలు, తాడు, ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబింగ్ సాధనాల కిట్లు) మరియు పదార్థాలు (బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ లిక్విడ్, మలతైన్, సోడియం క్లోరేట్, ఫినాయిల్ మొదలైనవి) ఉంటాయి.
- నిల్వ నీటి ద్వారా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నిరోధించేందుకు కాలువలు, ట్యాంకుల సమయానుకూల శుభ్రతను ప్రోన్ డాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించబడుతుంది. తక్షణంగా చెత్త కుప్పలను తొలగించడం కూడా అత్యవసరమని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడమైనది. ప్రభావిత ప్రాంతాల్లో తాగు నీరు క్యాన్లు, తాగు నీటి ప్యాకెట్లు సరఫరా చేయడం జరుగుతోంది.