ఈకలు పీకట్లేదు కానీ.. ఆ వేళలో వీడియో రిలీజ్ చేయొచ్చుగా పవన్?
విపత్తు వేళ కనిపించకుండా పోయానన్న నింద ఎదుర్కొంటున్న పవన్.. తన మీద విమర్శలు చేసే వారికి సమాధానం ఇచ్చేశారు.
వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాధితుల్ని పరామర్శించేందుకు రాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. బాధితుల వద్దకు రాకపోవటానికి ఉన్న కారణాన్ని వెల్లడించటం తెలిసిందే. తాను వస్తే.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని.. అందుకే రాలేకపోయినట్లుగా పేర్కొన్నారు. విపత్తు వేళ కనిపించకుండా పోయానన్న నింద ఎదుర్కొంటున్న పవన్.. తన మీద విమర్శలు చేసే వారికి సమాధానం ఇచ్చేశారు. విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని పరిశీలించిన పవన్.. రాష్ట్ర హోం మంత్రి అనిత.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సిసోడియా.. ఇతర ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా తాను బయటకు రాకపోవటానికి కారణాల్ని వెల్లడించారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. పవన్ కల్యాణ్ చెప్పిన దాన్లోనూ నిజం ఉంది. ఆయన కానీ బాధితుల్ని పరామర్శించేందుకు బయటకు వస్తే.. అక్కడి వారు తాము ఉన్న బాధను మరిచి ఎంత హడావుడి చేస్తారో తెలిసిందే. ఈ కారణంగా సహాయక చర్యలు ఆలస్యమైనా అయిపోవచ్చు. ఈ నేపథ్యంలో పరామర్శలకు పవన్ రాకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ.. పవన్ చెప్పిన మాటల్లో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.
బయటకు వస్తే.. జనాలు ఇబ్బంది పెట్టేస్తారు. కానీ.. నేను ఉన్నా.. నేను చూస్తున్నా.. నేను వింటున్నా.. అన్న చందంగా ఒక వీడియో సందేశం.. ఇప్పటి మాదిరి ఉన్నతాధికారులతో రివ్యూ చేయటం లాంటివి ఎందుకు చేయలేదు? లేదంటే.. విజయవాడ కేంద్రంగా కానీ మరే ఇతర ప్రాంతంలో కానీ ఒక వార్ రూంను ఏర్పాటు చేసి.. పగలు రాత్రి అన్న తేడా లేకుండా రివ్యూ చేసేయొచ్చుగా? దానికి సంబంధించిన ఫుటేజ్ ను విడుదల చేస్తే సరిపోయేదిగా? అలాంటివి పవన్ ఎందుకు చేయనట్లు? ఇప్పటి మాదిరి రివ్యూ భేటీలు కూడా ఆది, సోమవారాల్లో ఎందుకు చేయనట్లు? అంటూ ప్రశ్నిస్తున్నారు. పరామర్శపై పవన్ వినిపించిన వివరణ బాగానే ఉన్నా.. లాజిక్ మాత్రం మిస్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.