కడపలో క్యాంప్ ఆఫీస్... పవన్ వర్సెస్ జగన్ !
వైసీపీ అంటే పవన్ ఇలా నేరుగా వచ్చేసి విమర్శలు చేశారని కానీ దాడి వెనక పూర్వపరాలు ఆయన తెలుసుకొవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కడప జిల్లా గాలివీడు లో ఒక ఎంపీడీవో మీద జరిగిన దాడిని ఖండించడమే కాదు ప్రత్యేక విమానంలో ఆయన వచ్చి ఏకంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఎంపీడీవోని పలకరించారు.
ఆ మీదట ఉద్యోగులకు ధైర్యం చెప్పారు. ఇక మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కి గట్టిగానే చెప్పాల్సింది చెప్పారు. మీ వారిని కంట్రోల్ లో పెట్టుకో జగన్ అంటూ సూటిగానే చెప్పేశారు. నా సహనాన్ని పరీక్షించవద్దు అని ఆయన స్పష్టం చేశారు. జగన్ పార్టీ వారు ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలలో ఉంటే కనుక కఠినమైన పరిణామాలను ఎదుర్కొంటారు అని పవన్ హాట్ హాట్ గానే వార్నింగ్ ఇచ్చి పడేశారు.
రాయలసీమ మీ జాగీరు కాదు, ఎవరికీ ఇక్కడ కోటలు లేవు అని కూడా అన్నారు. తాను అన్నింటికీ తెగించి వచ్చిన వాడిని అని చెబుతూ ఏమి చేయాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో తనకు బాగా తెలుసు అన్నారు. జగన్ ధర్నాలు నిరసనలు అని కల్లబొల్లి కబుర్లు చెప్పడం కాదని తన వారిని అదుపులో పెట్టుకోవాలని పవన్ సూచించారు.
పరిస్థితులు ఇలాగే ఉంటే తాను స్వయంగా కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టి మరీ అన్ని లెక్కలూ సరిచేస్తాను అని ఘాటైన హెచ్చరికనే జారీ చేశారు. ఇలా పవన్ మరోసారి వేడిగా వాడిగా కామెంట్స్ చేయడం వెనక వ్యూహమేంటి అన్న చర్చ సాగుతోంది.
జగన్ పులివెందులలో నాలుగు రోజుల పాటు పర్యటించారు.జగన్ ప్రజా దర్బార్ కి జనమే జనంగా తరలి వచ్చారు. అలా వచ్చిన వారు అంతా రాయలసీమ జిల్లాల నుంచే పెద్ద సంఖ్యలో వచ్చారు. దాంతో వైసీపీ మళ్లీ అక్కడ తన పట్టుని పెంచుకుంటోందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.
దాంతో జగన్ తన పర్యటన పూర్తి చేసుకుని ఇలా బెంగళూరు విమానం ఎక్కగానే అలా పవన్ ప్రత్యేక విమానంలో వచ్చారని అంటున్నారు. దీని మీద మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కడప జిల్లా వచ్చి దాడికు గిరి అయిన ఎంపీడీవోను పరామర్శించడం వరకూ బాగానే ఉన్నా అదే పనిని ఆయన కాకినాడలో తన పార్టీ ఎమ్మెల్యే ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడి చేస్తే ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు.
వైసీపీ అంటే పవన్ ఇలా నేరుగా వచ్చేసి విమర్శలు చేశారని కానీ దాడి వెనక పూర్వపరాలు ఆయన తెలుసుకొవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. తన పార్టీ నేతల మీద టీడీపీ వారు దాడి చేసిన సంగతిని పవన్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అని కూడా ఆయన నిలదీశారు.
మొత్తం మీద చూస్తే పవన్ చూపు రాయలసీమ మీద పడుతోంది అని అంటున్నారు. వైసీపీని మళ్లీ బలపడకుండా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని ఆయన పట్టుదల చూస్తూంటే కడపలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసినా చేస్తారు అని అంటున్నారు. అపుడు డైరెక్ట్ గానే పవన్ వర్సెస్ జగన్ గా రాజకీయం సాగడం కూడా ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.