భార్యతో కలిసి టూర్లు.. పవన్ కొత్త అలవాటు వెనుక అసలు లెక్క ఇదేనా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. త్వరలో ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కానున్నట్లుగా చెబుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. త్వరలో ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కానున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ గెలుపు ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక.. పిఠాపురం స్థానికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నా.. ఇదే అంశాన్ని మెజార్టీ ప్రజల నోటి నుంచి వినిపిస్తోంది. దీంతో.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఇన్నాళ్లకు అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నట్లుగా చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో జనసేనాని తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. గతంలో ఈ తరహా తీరును ఆయన ప్రదర్శించలేదని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో ఆయన తన భార్య అన్నాను వెంట బెట్టుకొని పలు కార్యక్రమాల్లో హాజరు కావటం ఆసక్తికరంగా మారింది.
పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల మీదా.. భార్యల మీదా ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ వ్యాఖ్యలు చేయటం.. పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయటం తెలిసిందే. మొదట్లో ఈ అంశాన్ని పెద్దగా పట్టనట్లుగా ఉన్న పవన్.. ఇటీవల కాలంలో స్పందంచటమే కాదు.. తన మీద విమర్శల కోసం పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించటం గమనార్హం. నాలుగో పెళ్లి అంటూ చేస్తున్న ప్రచారం కూడా ఎక్కువైంది. దీంతో.. తన భార్యను తీసుకొని ఇటీవల కాలంలో పలు చోట్లకు తీసుకెళుతున్నారు.
తన భార్యకు ఓటుహక్కు లేనప్పటికీ పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి.. ఆమెకు చూపించే ప్రయత్నం చేయటంతో పాటు.. పోలింగ్ ఏ తీరులో జరుగుతుందో వివరించారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ సందర్భంగా తన భార్య అన్నాతో కలిసి పవన్ ప్రయాణించారు. అంతేకాదు.. వీరిద్దరూ జంటగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లి పూజలు.. అభిషేకాన్ని చేపట్టారు. ఇదిలా ఉంటే.. పవన్ వెంట యూపీ పర్యాటక మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా పవన్ దంపతుల వెంట ఉంటూ.. జాగ్రత్తగా తీసుకోవటం కనిపించింది. ఇంత తక్కువవ్యవధిలో ఇన్ని చోట్లకు తన భార్యను తీసుకెళ్లిన మొదటి ఉదంతంగా పవన్ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు.
ఇంతకూ పవన్.. తన భార్యను పలుచోట్లకు ఎందుకు తీసుకెళుతున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..పవన్ పెళ్లిళ్ల అంశాన్ని ఎన్నికల ప్రచారాల్లో వాడటం.. మూడో భార్యతోనూ సంబంధాలు సరిగా లేవని.. రేపో మాపో విడాకులకు సిద్ధమవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి తప్పుడు వాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా ఆమెను తీసుకొచ్చారని చెబుతున్నారు.
అంతేకాదు.. భార్య విషయంలో తన మీద బురద జల్లే వారందరికి టోకుగా సమాధానం చెప్పేందుకే ఈ వరుస ట్రిప్పులని తెలుస్తోంది. అయితే.. ఇదే పనిని ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందుగా రంగంలోకి దింపి ఉండి ఉంటే మరింత బాగుండేదంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెంట తీసుకొని వెళ్లటం ద్వారా మహిళల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేలా చేసి ఉంటే మరింత బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. గతానికి భిన్నంగా పలు కార్యక్రమాలకు తన రష్యా భార్యను వెంట పెట్టుకొని తిరుగుతున్న పవన్ తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.