వేతనంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌.. ఎందుకిలా?

ఆయ‌న చెప్పుకొన్నారు క‌దా! ఇక‌, ఇప్పుడు ఆయ‌న స‌ర్కారు నుంచి వేత‌నం రూపంలో సొమ్ములు తీసుకునే విష‌యంపై ఊగిస‌లాట‌లో ఉన్నారు.

Update: 2024-07-07 00:30 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయ‌తీరాజ్, అట‌వీ శాఖల మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు స‌ర్కారు ఇచ్చే వేత‌నంపై తీసుకోవాలా? వ‌ద్దా? అనే త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఆయ‌న సినిమా షూటింగుల‌తో పోల్చుకుంటే.. స‌ర్కారు ప‌రంగా వ‌చ్చే వేత‌నం ఓ మూల‌కు రాద‌న్న విష‌యం తెలిసిందే. మంత్రిగా.. ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చే శాల‌రీ అన్నీక‌లుపుకొంటే.. నెల‌కు 6-7 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంది. కానీ, ప‌వ‌న్ షూటింగుల‌కు వెళ్తే ఎంత వ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న చెప్పుకొన్నారు క‌దా! ఇక‌, ఇప్పుడు ఆయ‌న స‌ర్కారు నుంచి వేత‌నం రూపంలో సొమ్ములు తీసుకునే విష‌యంపై ఊగిస‌లాట‌లో ఉన్నారు.

ఎన్నిక‌లు ముగిసి.. పిఠాపురం నుంచి ప‌వ‌న్ విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. ప‌వ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిం దే. ఎమ్మెల్యేగా తాను జీతం తీసుకుంటాన‌ని చెప్పారు. ఇది రూ.3 ల‌క్ష‌ల‌లోపు ఉంటుంది. ఇత‌ర అల‌వెన్సులు కూడా క‌లుపు కొంటే.. మ‌రో ల‌క్ష‌న్న‌ర ఉంటుంది. మొత్తంగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌వ‌న్‌కు నెల‌కు వ‌స్తుంది. దీనిని తీసుకుంటాన‌ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. ఎవ‌రూ ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌లేదు. దీనికి కార‌ణం కూడా చెప్పుకొచ్చారు. ప్ర‌జాధ‌నాన్ని వేత‌నం రూపంలో తీసుకుని.. ఖ‌ర్చు చేస్తున్న ప్ర‌తిసారీ.. తాను ప్ర‌జాసేవ‌కుడిన‌నే విష‌యం గుర్తు చేస్తుంద‌న్నారు.

త‌ద్వారా.. త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరుగుతుంద‌ని.. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని త‌న మ‌న‌సు నిరంత‌రం త‌న‌ను ప్రోత్స‌హిస్తుంద ని, అందుకే తాను వేత‌నం తీసుకోవాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు ప‌వ‌న్ వెల్ల‌డించిన విష‌యం ప్ర‌ముఖంగా వైర‌ల్ అయింది. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌లేదు. ఎంత స్వ‌చ్ఛంద సేవ చేసేవారికైనా.. త‌న ప‌రివారానికి ఉండే ఖ‌ర్చులు ఉంటాయి. సో.. ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఎవ‌రూ త‌ప్ప‌ప‌ట్ట‌లేదు. తీసుకోవ‌డం త‌ప్పు కూడా కాదు. అయితే.. అనూహ్యంగా ఈ వేత‌నం తీసుకునే విష‌యంపై ప‌వ‌న్ మాట మార్చారు. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఆయ‌న వ‌రుసగా స‌మీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌కు సంబంధించి ఆయ‌న సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించారు. ఆయా శాఖ‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విష‌యాన్ని గుర్తించారు. అంతేకాదు.. పంచాయ‌తీ నిధుల‌ను గ‌త వైసీపీ ప్ర‌భుత్వం దారి మ‌ళ్లించింద‌ని కూడా ప‌వ‌న్ తెలుసుకున్నారు. అప్ప‌ట్లోనే పంచాయ‌తీల‌కు ఇచ్చిన 8 వేల కోట్ల‌లో రూ.7 కోట్లు మాత్ర‌మే మిగిల్చార‌ని.. ఇది రెండు నెల‌ల ఉద్యోగు ల వేత‌నానికి మాత్ర‌మే స‌రిపోతుంద‌న్నారు. క‌ట్ చేస్తే.. రెండు రోజుల కిందట ప‌వ‌న్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తాను వేత‌నం తీసుకోబోన‌ని చెప్పారు.

దీనికి కార‌ణం కూడా ఆయ‌నే చెప్పారు. పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌లో రూపాయి కూడా లేద‌ని.. ప్ర‌స్తుతం క్లిష్ట‌మైన స్థితిలో ఉంద‌ని.. ఇప్పుడు తాను వేత‌నం తీసుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. నిజానికి అసెంబ్లీకి హాజ‌రైనందుకు .. స‌భ్యుల‌కు వేత‌నం చెల్లిస్తారు. రోజుకు ఇంత‌ని లెక్క‌గ‌ట్టి ఇస్తారు. ఇలా.. ప‌వ‌న్ హాజ‌రైన మూడు, నాలుగు రోజుల స‌భ‌కు సంబంధించి రూ.35,375 చెక్కును అధికారులు అందించేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. కానీ, తాను వ‌ద్ద‌న్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. రాష్ట్ర ఖ‌జానాను వైసీపీ ఊడ్చేసింద‌ని.. దీనిని చూసిన త‌ర్వాత‌.. తన‌కు మ‌నసురాలేద‌న్నారు.

అయితే..ఇక్క‌డ చిన్న సందేహం.. వెంటాడుతోంది. వాస్త‌వానికి ప‌వ‌న్‌కు రాష్ట్ర ఆర్థిక స్థితి ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముందే తెలుసు. ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. ఖ‌జానాను వైసీపీ ఖాళీ చేసింద‌ని.. అయిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత వేత‌నం తీసుకుంటాన‌న్నారు. ఇప్పుడు మ‌ళ్లీ వేత‌నం వ‌ద్ద‌ని చెబుతుండ‌డంతో జీతం విష‌యంలో ప‌వ‌న్‌.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. డిప్యూటీ సీఎంగా త‌న ఛాంబ‌ర్‌ను కొత్త ఫ‌ర్నిచ‌ర్‌తో మార్పు చేసేందుకు కూడా ప‌వ‌న్ ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలిసింది. దీనికి అయ్యే ఖ‌ర్చు వ‌ల్ల ఖ‌జానాపై భారం ప‌డుతుంద‌ని ఆయ‌న భావించి ఉంటారు.

Tags:    

Similar News