ఆ సర్వేల ప్రకారం పిఠాపురంలో పవన్ పోటీ?

ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పిఠాపురంలో పోటీచేయబోతున్నారని, అక్కడ రెండు సార్లు సర్వే కూడా చేయించారని టాక్ వస్తోంది.

Update: 2024-03-01 10:14 GMT

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు, 3 లోక్సభ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదుగురు అభ్యర్థుల పేర్లను కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే, పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న సంగతి మాత్రం సస్పెన్స్. ఇక, మిగతా 19 మంది అభ్యర్థులు ఎవరు అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ స్థానాలు ఏమిటి అనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పిఠాపురంలో పోటీచేయబోతున్నారని, అక్కడ రెండు సార్లు సర్వే కూడా చేయించారని టాక్ వస్తోంది.

వాస్తవానికి భీమవరంలో ఈసారి పవన్ పోటీ చేయబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో భీమవరంలోని టిడిపి నేతలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తనకు మద్దతు ఇవ్వాలని స్వయంగా అడిగారని కూడా ప్రచారం జరిగింది. అయితే, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు ఆ నియోజకవర్గంలో తెరపైకి రావడంతో భీమవరంలో పవన్ పోటీ చేయడం లేదని తేలిపోయింది. దీంతో, పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి నెలలో ఈ నియోజకవర్గంలో తాను పోటీ చేసే విషయంపై పవన్ రెండుసార్లు సర్వే చేయించుకున్నారని తెలుస్తోంది.

ఈ నియోజకవర్గంలోని రెండున్నర లక్షల ఓట్లలో కాపుల ఓట్లు దాదాపు 60 వేల వరకు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాపులతో పాటు టీడీపీ-జనసేనకు మద్దతిచ్చే వారంతా పవన్ కు ఓటు వేస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అని జనసేన నేతలు భావిస్తున్నారట. గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా కాపులు వర్సెస్ బీసీలు, ఎస్సీలు అన్న రీతిలో వర్గపోరు నడుస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎస్సీ, బీసీల ఓట్లలో మెజారిటీ ఓట్లు వైసీపీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో వారికి వ్యతిరేకంగా కాపులంతా కచ్చితంగా తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కు ఓటు వేస్తారని జనసేన నేతలు, కాపు నేతలు భావిస్తున్నారు.

Tags:    

Similar News