ఉక్కు ప్యాకేజీ క్రెడిట్ కమలానిదేనా !
దాంతో బీజేపీ నేతలు తమకు తాముగానే విశాఖ ఉక్కు కోసం అర్ధిక సాయం అందించామని చెప్పుకుంటున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ఆర్ధిక ప్యాకేజిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే ఆ తరువాత టీడీపీ దాని మీద భారీ ప్రచారం చేసుకుంది. చంద్రబాబు వల్లనే ఇది సాధ్యమైంది అని టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతలు అంతా గట్టిగా చెప్పుకున్నారు. దాంతో బీజేపీ నేతలు తమకు తాముగానే విశాఖ ఉక్కు కోసం అర్ధిక సాయం అందించామని చెప్పుకుంటున్నారు.
అయితే అదంతగా జనంలోకి వెళ్లకపోవడంతో కేంద్రంలో ఉక్కు మంత్రిగా ఉన్న కుమారస్వామిని విశాఖ స్టీల్ ప్లాంట్ కి రప్పించి మరీ క్రెడిట్ అంతా మాదే అని చాలా గట్టిగానే చెప్పుకునే ప్రయత్నం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రులకు సెంటిమెంట్ అని అందుకే దానిని కాపాడుతున్నామని చెప్పారు.
ఇక కుమారస్వామి పర్యటనలో బీజేపీ నేతల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అలాగే మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహా బీజేపీ నాయకులు అంతా కలసి విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన కార్యక్రమంలో కనిపించారు.
ఈ సందర్భంగా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదు అని కుమారస్వామి చెప్పారు. లాభాల బాటను పట్టిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు సమస్యలు మొత్తం తనకు తెలుసు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అగ్రగామిగా నిలబెడతామని అన్నారు.
తాను తొలిసారి కేంద్ర మంత్రి కాగానే విశాఖ ఉక్కుని సందర్శించానని ఆ మీదట కేంద్ర ప్రభుత్వంతో చర్చించి భారీ ప్యాకేజి వచ్చేలా చూశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉందని అన్నారు.
అయితే విశాఖ ఉక్కు కార్మికుల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ఆసక్తిని చూపించాలని కార్మిక సంఘాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని స్పష్టగా ప్రకటించి కేబినెట్ ఆర్ధిక కమిటీ ఈ మేరకు తీర్మానం చేసిందని దానిని ఉపసంహరించుకుంటేనే తప్ప విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదని తాము నమ్మలేమని అంటున్నారు.
సొంత గనులు కేటాయించడానికి సెయిల్ లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందని కూడా ప్రశ్నిస్తున్నారు. భారీ ప్యాకేజ్ తో విశాఖ ఉక్కు కష్టాలు తీరవని సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఆర్ధిక ప్యాకేజిని చూపించి ఉక్కు నగరంలో పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగమే కేంద్ర మంత్రి రాక అని అంటున్నారు. ఒక వైపు అయిదారు నెలలుగా ఉక్కు కార్మికులకు జీతాలు లేవని మరో వైపు వీఆర్ ఎస్ పేరుతో రెండు వేల మందిని ఇంటికి పంపుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో పూర్తి నిబద్ధతతో చిత్తశుద్ధితో బీజేపీ వ్యవహరించాలని కోరుతున్నారు. ఇక చూస్తే విశాఖకు వచ్చిన కేంద్ర మంత్రి వెంట బీజేపీ నేతలు కనిపించారు. ఎటు చూసినా కాషాయ పార్టీ తోరణాలు కనిపించాయి. దాంతో ఇది పూర్తిగా బీజేపీ కార్యక్రమంగానే సాగిపోయింది. క్రెడిట్ కోసమే కమలం పార్టీ ఇదంతా చేస్తోంది అని అంటున్నారు.