పవన్ జోలికి వస్తే వదిలిపెట్టం : మాజీ సీఎం జగన్ పై యువనేత లోకేశ్ ఫైర్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడంతో జగన్ కు భయం పట్టుకుందని అన్నారు.;
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై యువ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కించపరిచేలా మాట్లాడితే సహించే పరిస్థితి లేదని హెచ్చరించారు. అహంకారానికి ఫ్యాంటు షర్టు వేస్తే అచ్చు జగన్మోహరెడ్డిలా ఉంటారని వ్యాఖ్యానించిన జగన్.. ప్రతిపక్ష నేత హోదా కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావొచ్చుని, ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడంతో జగన్ కు భయం పట్టుకుందని అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కించపరిచేలా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం కూటమి నేతలకు ఆగ్రహం తెప్పించింది. జగన్ తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు, మంత్రులతో కలిసి మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. జగన్ ఐదేళ్లు సీఎంగా ఉండగా ఎవరినీ కలవలేదని, ఇప్పుడు శాసనసభకు రాకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు దూరంగా జీవించడానికి జగన్ అలవాటు పడ్డారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయంలో జగన్ ఆచితూచి మాట్లాడాలని సూచించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నాయకత్వానికి ప్రజలు మద్దతు పలికారని గుర్తించుకోవాలన్నారు. పవన్ కోసం మాట్లాడే ముందు జగన్ తనకు వచ్చిన సీట్లు, పులివెందులలో వచ్చిన మెజార్టీని చూసుకోవాలన్నారు.
జగన్ ప్రస్టేషన్ లో ఉన్నారని తమకు అర్థమవుతోందని చెప్పిన లోకేశ్.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతి, అడ్డగోలుతనంతో వ్యవహరించారన్నారు. ప్రతిపక్షంలో నీతులు, విలువలు గురించి జగన్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వాస్తవాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదన్నారు. జగన్ తీరును పరిశీలిస్తే ఆయనకు ఏమీ రాదు, తెలియనది అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
జగన్ కి అధికార కాంక్ష ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పిన లోకేశ్.. తండ్రి శవం పక్కన పెట్టుకుని అధికారం కోసం సంతకాలు సేకరించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదన్నారు. 2019లో సొంత బాబాయ్ ని లేపేసి, తమపై నిందలు వేశారన్నారు. అలాంటి వ్యక్తులు ఉప ముఖ్యమంత్రిపై మాట్లాడటం బాధగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో బూతులు తిట్టే శాసనసభ్యులు లేరని తెలిపారు. వైనాట్ 175 అన్నవారికి 11 స్థానాలు ఇచ్చిన విషయం తెలుసుకోవాలన్నారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలు 11 స్థానాలు ఎందుకిచ్చారో ఇప్పటికైనా ఆలోచించాలన్నారు. ఎమ్మెల్యేలుగా గెలవకుండా అసెంబ్లీకి వస్తానంటే కుదురుతుందా? అని ప్రశ్నించారు.
జగన్ రాత్రులు ఆత్మలతో మాట్లాడుతూ పగలు ఏవేవో పనులు చేస్తుంటారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అమరావతి, పోలవరం పనులు జరుగుతున్నాయని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. జగన్ ఐదేళ్ల అధికారంలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు.