అక్కడ వైసీపీ విలీనం...బీజేపీ స్కెచ్ గీస్తోందా ?
ఇపుడు అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.
ఇప్పటికి అయిదేళ్ళ క్రితం ఒక ముచ్చట రాజ్యసభలో జరిగింది. అదేంటి అంటే ఆనాడు 2019లో టీడీపీకి రాజ్యసభలో అయిదుగురు ఎంపీలు ఉంటే అందులో నలుగురు ఎంపీలు బీజేపీలో చేరి తమ పార్టీ రాజ్యసభలో బీజేపీలో విలీనం అయిందని ప్రకటించారు. నాటి రాజ్యసభ చైర్మన్ కూడా దానికి ఆమోదముద్ర వేశారు. ఇక ఒకే ఒక్క ఎంపీగా కనకమేడల రవీంద్రబాబు మాత్రమే టీడీపీ తరఫున రాజ్యసభలో ఉండేవారు.
ఇపుడు అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. వైసీపీ బలం రాజ్యసభలో 11 నుంచి ఈ రోజుకు ఏడుకు పడిపోయింది. దాంతో ఇక ఈ ఏడుగురిలో ఎందరు పార్టీలో ఉంటారు ఎవరు వీడుతారు అన్నది ఒక వైపు డిస్కషన్ హాట్ హాట్ గా సాగుతోంది.
మరో వైపు చూస్తే వైసీపీలో ఉన్న ఎంపీలు రాజీనామా చేస్తే కనుక ఆ సీట్లు కూటమికే పోతున్నాయి. వారు కొత్త అభ్యర్ధులను పెట్టుకుని రాజ్యసభలో బలం పెంచుకుంటున్నారు. దాంతో మాకేంటి లాభం అన్న తీరున కొందరు ఎంపీలు మౌనంగా ఉండిపోతున్నారు అని ప్రచారం సాగుతోంది. అదే తమ పదవులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉంటే పార్టీ కండువా మార్చుకోవడానికి సిద్ధమవుతారేమో అన్నది కూడా చర్చకు వస్తోంది.
అదే సమయంలో ఒక్కో ఎంపీ రాజీనామా చేయడం దాని కోసం ఎన్నికలు రావడం ఏపీలో బీజేపీకి బలం లేకపోవడంతో ఆయా సీట్లకు కూటమి పార్టీలైన టీడీపీ జనసేన ముందుకు రావడం వంటివి జరుగుతున్నాయి. దాంతో అటువంటి ఇబ్బంది లేకుండా కూటమి పార్టీల మద్దతు మీద ఆధారపడకుండా చేసుకోవాలనుకుంటే రాజ్యసభలో వైసీపీని బీజేపీలో విలీనం చేసుకోవడం కంటే మార్గం వేరేది ఉండబోదని అంటున్నారు.
ఆ విధంగా ఉభయకుశలోపరి మార్గంగా చేసుకుని బీజేపీ భారీ స్కెచ్ గీస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదే కనుక జరిగితే వైసీపీలో ఎందరు మిగులుతారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. రాజ్యసభలో వైసీపీకి ఎవరూ మిగలరు అని రఘురామ క్రిష్ణం రాజు అయితే ఇప్పటికే జోస్యం చెప్పారు. ఆయన ఒక్కరే కాదు వైసీపీ మునిగిపోతున్న నావ అని టీడీపీ మంత్రులు సీనియర్ నేతలు చాలా మంది చెబుతున్నారు.
ఇక చూస్తే రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. దాంతో వైసీపీని పూర్తిగా టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఇదే కనుక జరిగితే వైసీపీలో మిగిలే ఎంపీలు ఎవరు అన్నది చూడాలని అంటున్నారు. జగన్ కి స్వయంగా చిన్నాన్న కాబట్టి వైవీ సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతారా లేక ఇంకా ఎవరైనా ఉంటారా అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తంగా చూస్తే వైసీపీని రాజకీయంగా ఏమీ కాకుండా చేసేందుకు బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. రాజ్యసభలో వైసీపీ విలీనం అన్నది కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో అది ఒక భారీ ప్రకంపనలు సృష్టించినట్లు అవుతుందని అంటున్నారు.