టార్గెట్ అంజు యాదవ్: శ్రీకాళహస్తిని సందర్శించనున్న పవన్!
రెండు దఫాలుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను పూర్తి చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... సోమవారం తిరుపతి జిల్లాకు వెళ్లనున్నారు.
రెండు దఫాలుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను పూర్తి చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... సోమవారం తిరుపతి జిల్లాకు వెళ్లనున్నారు. శ్రీకాళహస్తిలో తమ పార్టీ కార్యకర్తని చెంపలపై కొట్టిన సీఐ అంజుయాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే ప్రభుత్వం అలర్ట్ అయ్యిందని తెలుస్తుంది.
అవును... ఇటీవల శ్రీకాళహస్తిలో పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో స్థానిక సీఐ, జనసేన కార్యకర్తపై దాడి చేశారనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా జులై 12న శ్రీకాళహస్తిలో జనసేన క్యాడర్ ప్రదర్శన నిర్వహించింది. ఇందులో భాగంగా... సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.
అయితే అందుకు పోలీసులు ఏమాత్రం అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నిరసనలో పాల్గొన్న జనసేన కార్యకర్త సాయిపై సీఐ దాడి చేశారని అంటున్నారు. అయితే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.
తన పార్టీ కార్యకర్త సాయిని సీఐ కొట్టారనే వార్తలపై సీరియస్ గా స్పందించిన పవన్... ఈ విషయంపై శ్రీకాలహస్తిలోనే తేల్చుకుంటామంటూ వారాహి సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ఆన్ లైన్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదే సమయంలో ఘటన జరిగిన వెంటనే సీఐ అంజుయాదవ్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేయడం గమనార్హం. కొంతమంది పోలీసు అధికారుల అత్యుత్సాహం... మొత్తం డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు తెస్తోందని రామయ్య చెప్పుకొచ్చారు.
కాగా... ఇప్పటికే ఈ వ్యవహారంపై నివేధిక ఇవ్వాలని ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... విచారణ జరిపి ఈనెల 27న నివేదిక సమర్పించాలని, శ్రీకాళహస్తి సిఐ, తిరుపతి డిఎస్పి, ఎస్పి లకు హెచ్.ఆర్.సీ. ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లడానికంటే ముందే సీఐపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో డీజీపీ ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే... జనసేన కార్యకర్త సాయిని కొట్టడానికి దారి తీసిన పరిస్థితులు, ఆ రోజు అసలేం జరిగింది అనే విషయాలకు సంబంధించిన సమగ్ర నివేదికను ఎస్పీ పరమేశ్వరరెడ్డి.. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డికి పంపారని అంటున్నారు.
కాగా... వైసీపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యం అంటూ పవన్ జూన్ 14న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి తన వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పవన్ తాజాగా తన యాత్ర రెండు దశలను పూర్తి చేశారు. ఇందులో భాగంగా... జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు నరసాపురం, పాలకొల్లు, భీమవరాల్లో పూర్తి చేయగా..., జులై 9 నుంచి జూలై 14 వరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.