పొత్తుల పేరయ్య పవనేనట ...!

పొత్తులు ఎత్తులు అన్నీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకే తెలుసు అని అంతా అనుకుంటారు

Update: 2024-02-21 12:36 GMT

పొత్తులు ఎత్తులు అన్నీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకే తెలుసు అని అంతా అనుకుంటారు. ఆయన ఏపీలో వైసీపీని ఓడించేందుకు బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారు అని అంతా అనుకున్నారు. చంద్రబాబు చాణక్యం గ్రేట్ అని కూడా భావించారు.

అయితే పొత్తుల పేరయ్య చంద్రబాబు కానే కాదు తెర వెనక మొత్తం కధ నడిపింది చక్రం తిప్పింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. పవన్ పార్టీ క్యాడర్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పడం ఆసక్తికరంగానే ఉంది.

బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పొత్తుల కోసం ఒప్పించడం కోసం తాను ఎన్ని బాధలు పడ్డానో పవన్ చెప్పారు. అంతే కాదు తాను తిట్లు కూడా తిన్నానని ఆయన అనడం సంచలనమే. అయినా సరే ఏపీ బాగు కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం తాను బీజేపీ పెద్దలకు దండం పెట్టి బతిమాలి బామాలి కూటమిలోకి తీసుకుని వచ్చాను అని పవన్ చెబుతున్నారు.

తాను ఇంతలా బలవంతం చేయబట్టే బీజేపీ టీడీపీతో కలసి రావడానికి అంగీకరించింది అన్నది పవన్ మాటగా ఉంది. మరో వైపు చూస్తే బీజేపీకి టీడీపీ అంటే అంత ఇష్టం లేనపుడు పవన్ ఎందుకు కలపాల్సి వచ్చింది అన్నది ఇక్కడ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. రాష్ట్ర శ్రేయస్సు కోసం అని పవన్ అంటున్నారు కానీ ఏపీ శ్రేయస్సుకు బీజేపీ గత పదేళ్లలో ఏమి చేసింది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం పూర్తి కాలేదు, ఢిల్లీని తలదన్నే రాజధాని కూడా కట్టించి ఇవ్వలేదు, ఉమ్మడి ఆస్తుల సంగతి తేల్చలేదు. విభజన హామీలు అన్నీ అలాగే ఉన్నాయి. విశాఖకు రైల్వే జోన్ కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా అదే విధంగా ఉన్నాయి అన్నది జనాల మాటగా ఉంది.

ఇవి చాలదన్నట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించి తీరుతామమి బీజేపీ పట్టుదలగా ముందుకు పోతున్న నేపధ్యం ఉంది. ఇలా బీజేపీ ఏ విధంగా చూసినా ఏపీ శ్రేయస్సుకి తనదైన ప్రోత్సాహం ఇవ్వలేదనే సగటు ఏపీ జనం అంటున్న మాట. ఇక ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య రాజకీయ సయోధ్య లేకుండా ఉన్న నేపధ్యంలో ఎందుకు పని గట్టుకుని పవన్ బీజేపీని టీడీపీలోకి చేర్పించారు అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది.

ఈ మూడు పార్టీలు కలిస్తే ఏపీకి రాజకీయ శ్రేయస్సు ఎలా వస్తుందో ఆయన చెప్పాలని అంటున్నారు. అయినా ఈ పొత్తు పాతదే కానీ కొత్తది కాదు కదా అని అంటున్నారు. 2014 నుంచి 2018 దాకా ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి కదా అని గుర్తు చేస్తున్నారు. ఆనాడే ప్రత్యేక హోదా ఇవ్వమని అది ముగిసిన అధ్యాయమని బీజేపీ ప్రకటించిన సంగతి కూడా గుర్తు చేస్తున్నారు.

పాచిపోయిన లడ్డూల వంటి ప్యాకేజి ఎందుకు అని పవన్ గర్జించిన విషయాన్ని కూడా జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లనే బీజేపీతో విభేదిస్తున్నామని కూడా చంద్రబాబు చెప్పి ధర్మపోరాటం ఏపీ నుంచి మొదలెట్టి ఢిల్లీ దాకా చేశారు అని కూడా చెబుతున్నారు

మరి ఇంతలా బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది అని నాడు చెబుతూ ఇపుడు బీజేపీ కూటమితో చేరడం వల్లనే ఏపీకి శ్రేయస్సు అని జనసేనాని అంటూంటే జవాబులు దొరకని ప్రశ్నలు ఎన్నో అని అంటున్నారు. ఇవన్నీ సరే కానీ ఈ బలవంతపు పొత్తులతో అయినా ఏపీలో రేపటి రోజున అధికారంలోకి వస్తే ఏపీ దశ తిరుగుతుందని కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు.

అదే విధంగా ఏపీలో మళ్లీ అభివృద్ధి లేదు అని విమర్శిస్తూ బీజేపీ నుంచి జనసేన టీడీపీ విడిపోరని గ్యారంటీ ఉందా అని కూడా అడుతున్నారు. రాష్ట్ర అవసరాలా లేక రాజకీయ అవసరలా అన్నది జనాలకు అయితే క్లారిటీ ఉందని అయితే ప్రతీ పొత్తూ ప్రజాభ్యుదయం కోసమైతే ఏపీ ఏనాడో బాగుపడేది అని కూడా సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News