పవన్ తో కమలం : చరిష్మా క్యాష్ చేసుకోవడంలేదా...?

పవన్ కళ్యాణ్ కేంద్ర బీజేపీ పెద్దలతోనే తన బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలతో ఆయన కలవడంలేదు అని అంటున్నారు.

Update: 2023-08-12 15:05 GMT

ఏపీలో జనసేనకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ అద్భుతమైన ఇందనంగా ఉంది. అయితే రాజకీయాల్లో ఇమేజ్ ఒక్కటే సరిపోదు, దానికి పార్టీ నిర్మాణం, యంత్రాంగం, వ్యూహాలు వెన్ను దన్ను అన్నీ కావాలి. అలా కనుక ఆలోచిస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం ద్వారా అండ దండలు అందించేందుకు రెడీగా ఉంది. అలా పవన్ గ్లామర్ ని సొమ్ము చేసుకుంటూ ఏపీలో జనసేన బీజేపీ కూటమి స్పీడ్ అందుకోవాల్సి ఉండగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా కధ సాగుతోంది.

ఒక్క రోజు తేడాతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఇద్దరూ ఏపీలో జనసేనతో తన బంధం కొనసాగుతుందని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇలా ఎందుకు ఇచ్చారు అది కూడా సడెన్ గా అన్న డౌట్ అయితే అందరిలో కలుగుతోంది. ఏపీలో బీజేపీ కూడా పోరాటాలు స్టార్ట్ చేసింది. అది కూడా సోలోగా. అదే విధంగా పవన్ కళ్యాణ్ సొంతంగా వారాహి యాత్రను చేసుకుంటూ పోతున్నారు.

ఈ నేపధ్యంలో ఏపీ బీజేపీ కూడా తన దారి తనది అన్నట్లుగా ఉంది. అయితే చిత్రమేంటి అంటే ఈ రెండు పార్టీలు బంధం ఉన్నట్లుగానే చెప్పుకుంటూ విడిగా పోరాటాలు చేయడం. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మూడవ దశ సందర్భంగా విశాఖలో జరిగిన సభలో మాట్లాడుతూ జగన్ ఆటకట్టిస్తాను అన్నారు. కేంద్ర ప్రభుత్వం అండదండలతో అని కూడా అన్నారు. దాని అర్థం బీజేపీ తన మిత్ర పక్షం అని ఆయన చెప్పకనే చెబుతున్నారు.

ఇక బీజేపీ కూడా మా పొత్తు పార్టీ జనసేన అంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే రెండు పార్టీలు ఒక్క అడుగు కూడా ఉమ్మడిగా వేయలేకపోతున్నాయి. పవన్ కళ్యాణ్ కేంద్ర బీజేపీ పెద్దలతోనే తన బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలతో ఆయన కలవడంలేదు అని అంటున్నారు. నెల రోజుల క్రితం బీజేపీ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురంధేశ్వరి పవన్ని త్వరలో కలుస్తామని, రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు.

కానీ ఇప్పటికీ ఈ భేటీ అయితే జరిగింది లేదు. మరి పవన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదా అన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే జనసేన ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీతో జనసేన కలవాలని చూస్తోంది. ఆ దిశగా బీజేపీ కూడా కలసి వస్తే అపుడు ఉమ్మడిగా పనిచేసే విషయం చూసుకోవచ్చు అన్నది ఆ పార్టీ ఆలోచన అని అంటున్నారు.

కేంద్రంలోని బీజేపీ మాత్రం జనసేనను దగ్గరకు తీస్తూనే వైసీపీకి కూడా స్నేహ హస్తం అందిస్తోంది. ఏపీలో వైసీపీకి ఇబ్బంది లేకుండా నిధులను అప్పులనూ ఇస్తోంది. అలాగే వైసీపీ కూడా బీజేపీ ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ మద్దతు ఇస్తోంది. దాంతో ఆ బంధం అలా కొనసాగుతోంది.

బహుశా ఈ రకమైన బీజేపీ ఆలోచనల వల్లనే జనసేన ఎటూ తేల్చుకోలేకపోతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే తెలంగాణా ఎన్నికల తరువాత బీజేపీ ఏపీలో పొత్తుల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో అప్పటిదాకా పవన్ సోలోగానే తన కార్యక్రమాలు చేసుకుంటారు అని అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలతో కూడా అప్పటిదాకా భేటీలు ఉండవని అంటున్నారు. ఒకవేళ బీజేపీ టీడీపీకి నో అంటే జనసేన టీడీపీతో కలసి వెళ్లడం ఖాయమని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఏపీలో రాజకీయ శూన్యత ఉంది. కేంద్రంలో బీజేపీకి ఏపీ మీద చూపు ఉంది. జనసేనకు కూడా అధికారంలోకి రావాలని ఉంది. కానీ ఎవరి ఆలోచనలు వారివిగా ఉండడం వల్లనే పొత్తులు ఉన్నా సోలో గానే సాగుతున్నారని అంటున్నారు. రాజకీయంగా చూస్తే పవన్ ఇమేజ్ ని బీజేపీ క్యాష్ చేసుకోవడంలో విఫలం అవుతోంది అని అంటున్నారు. అలాగే పవన్ కూడా కేంద్ర బీజేపీతోనే జట్టు కడుతూ ఏపీ బీజేపీ నేతలను దూరం పెడుతున్నారని అంటున్నారు. ఈ మిత్ర బంధం టీడీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది అని అంటున్నారు. అదే విధంగా వైసీపీకి కూడా ఇది రాజకీయ లాభాన్నే అందిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News