వారంతా పిరికివారు: వైసీపీపై ప‌వ‌న్ వ్యాఖ్య‌లు

ఒక విజ‌యాన్ని ఆశ్వాదించారు కానీ.. ఒక ఓట‌మిని మాత్రం వారు(వైసీపీ) అంగీక‌రించ‌లేక పోయారు. నేడు స‌భ‌కు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా రాలేదు. ఇది పిరికి చ‌ర్య‌. వారు పారిపోయారు'' అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

Update: 2024-06-22 06:49 GMT

వైసీపీ ఎమ్మెల్యేల‌పై డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ''ఒక విజ‌యాన్ని ఆశ్వాదించారు కానీ.. ఒక ఓట‌మిని మాత్రం వారు(వైసీపీ) అంగీక‌రించ‌లేక పోయారు. నేడు స‌భ‌కు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా రాలేదు. ఇది పిరికి చ‌ర్య‌. వారు పారిపోయారు'' అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. స‌భాప‌తిగా చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడిని ఎన్నుకున్న త‌ర్వాత‌.. ప‌వ‌న్ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని సూచ‌న‌లు చేస్తూనే వైసీపీకి చుర‌కలు కూడా అంటించారు.

వైసీపీ హ‌యాంలో స‌భ‌లంటే చీద‌ర పుట్టాయ‌ని ప‌వ‌న్ అన్నారు. దూష‌ణ‌లు, బూతుల‌కు కేంద్రంగా స‌భ ను మార్చార‌ని అన్నారు. ఏ ఒక్క‌రూ కూడా సంప్ర‌దాయాలు పాటించ‌లేద‌న్నారు. అందుకే గ‌త స‌భ విమ‌ర్శ‌లు ఎదుర్కొని.. చ‌రిత్ర‌లో నిలిచిపోయిందని చెప్పారు. కానీ, ఇప్పుడు ఏర్ప‌డిన స‌భ‌లో ఇలాంటి లేకుండా.. స‌భ్యుల‌ను గాడిలో పెట్టాల్సిన అవ‌స‌రం స‌భాప‌తిపైనే ఉంద‌న్నారు. స‌భ్యులు గాడి త‌ప్పినా.. వారిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

స‌భ‌ల‌కు ఒక గౌర‌వం ఉంద‌న్నారు. దీనిని పుస్త‌కాల్లో చ‌దువుకోవ‌డ‌మే కాదు.. చేసి చూపించాల‌ని తోటి స‌భ్యుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించారు. స‌భ అంటే.. కేవ‌లం చ‌ర్చ‌ల‌కే కాకుండా.. సందేశాల‌కు కూడా కేంద్రంగా ఉండాల‌న్నారు. గ‌తంలో స‌భ ఎలా ఉండాలో పెద్దలు వ్య‌వ‌హ‌రించి చూపించార‌న్న ప‌వ‌న్‌.. ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా ఉండాల‌న్నారు. గ‌తంలో వ్య‌వ‌హ‌రించారు క‌దా.. వారినే స్ఫూర్తిగా తీసుకుంటామ‌నే ప‌ద్ధ‌తిని వీడాల‌న్నారు.

ముఖ్యంగా.. గ‌త వైసీపీ స‌భ్యులు.. చిన్న పెద్ద అనే తేడాలేకుండా.. మ‌హిళ‌ల‌ను అవ‌మానించార‌ని.. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు కూడా అవ‌కాశం లేకుండా చేశార‌ని అన్నారు. అందుకే .. ప్ర‌జ‌లు వారిని శిక్షించార‌ని గుర్తు చేశారు. స‌భ‌లోనే కాదు.. బ‌య‌ట కూడా.. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. గ‌తం అయిపోయింది.. కానీ, ఇప్పుడు స‌భ‌కు వ‌న్నెతీసుకువ‌చ్చేలా చూడాల‌న్నారు.

Tags:    

Similar News