పొత్తుల కోసం దండాలు.. ఓట్ల కోసం డబ్బులు.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
అవును... తాజాగా కార్యకర్తలతో మాట్లాడిన పవన్ కల్యాణ్... టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటి నుంచీ చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... పొత్తుకోసం తాను పడ్డ కష్టాలను, శ్రమలను వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా చేతులు జోడించి మరీ అడిగినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో టీడీపీకి జనసేన ఓటు ట్రాన్స్ ఫర్ పైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు!
అవును... తాజాగా కార్యకర్తలతో మాట్లాడిన పవన్ కల్యాణ్... టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ఇందులో భాగంగా జాతీయ నాయకత్వంతో ఎన్నో చీవాట్లు తిన్నట్లు తెలిపారు. అదంతా తనను మెచ్చి మేకతోలు కప్పుతారని చేయలేదని చెప్పిన పవన్... అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకొవాల్సిన అవసరంలో భాగంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. అందువల్లే ఓట్లు చీలకుండా ఉండాలని కోరారు.
ఈ ప్రయత్నం కోసం ఎంతగా నలిగిపోయాననేది తానొక్కడికే తెలుసని చెప్పిన పవన్... జాతీయ నాయకుల వద్ద చేతులు జోడించి, దండం పెట్టి అడిగినట్లు తెలిపారు. ఇదంతా తాను జనసేన కోసం చేయలేదని.. రాష్ట్రం కోసం చేసినట్లు తెలిపారు. తన ప్రధాన లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే అని పవన్ స్పష్టం చేశారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి బలంగా ఉండాలని కోరిన పవన్... చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోవాలని.. ఫలితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అత్యధిక స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు! ఇందులో భాగంగా... త్యాగాలు చేసిన వారికి ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో న్యాయం జరుగుతుందని వెల్లడించారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో మూడొంతులు జనసేన పోటీ చేసే పరిస్థితులు రావాలంటే... ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే చోట్ల జనసేన నుంచి ఓటు ట్రాన్స్ ఫర్ జరిగాలని.. అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు బలం అవుతుందని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
డబ్బులు ఖర్చుపెట్టాల్సిందే!:
తాజాగా భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్... డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అని అన్నారు. ఓట్లు కొంటారా లేదా అనే విషయం మాత్రం తాను చెప్పనని చెప్పిన ఆయన... దేశమంతా అందమైన అబద్ధంలో బ్రతుకుతుందని.. వేల కోట్లు ఖర్చుపెడతారు కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఖర్చును రూ.45 లక్షలకు పెంచిందని పవన్ గుర్తు చేశారు!