పవన్ ఏం చెప్పబోతున్నారు....?

టీడీపీతో పొత్తుకు అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ చేసిన క్రమంలో ఇపుడు వారాహీ యాత్ర కొత్తగా కనిపించబోతోంది.

Update: 2023-10-01 03:43 GMT

పవన్ జనం మధ్యకు రావడం కొత్త కాదు, ఆయన సభలు పెట్టడమూ కొత్త కాదు, వారాహీ యాత్ర అంతకంటే కొత్త కాదు, కానీ ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన నేపధ్యంలో చంద్రబాబు అరెస్ట్ అయి మూడు వారాలుగా జైలు గోడల మధ్యన ఉన్న సందర్భంలో టీడీపీతో పొత్తుకు అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ చేసిన క్రమంలో ఇపుడు వారాహీ యాత్ర కొత్తగా కనిపించబోతోంది.

ఈ కీలక సమయంలో పవన్ ఏమి చెప్పబోతున్నారు అన్నది అందరిలో ఒక చర్చగా మారింది. అదే సమయంలో అందరిలో ఆసక్తిని కూడా రేపుతోంది. ఏపీలో గత మూడు వారాలుగా రాజకీయం వేడి అయితే పెద్దగా కనిపించడంలేదు మీడియాలో మాత్రమే టీడీపీ రగులుతోంది. అలాగే ఆ పార్టీ నుంచి ఏపీ స్టేట్ ని అంతా కదిలించే ఒక్క కార్యక్రమం కూడా లేకుండా పోయింది.

సరైన ఆందోళన కార్యక్రమాలతో ఏపీలోని జనాలను విపక్షం దిశగా నడిపించే పరిస్థితి అయితే లేదు. ఒక విధంగా చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ ఇబ్బందులలో కూరుకుని పోయింది. సరైన దిశా నిర్దేశం చేసే వారు ఆ పార్టీకి లేకుండా పోయారు.

దాంతో ఏపీలో రాజకీయం సో సోగా సాగుతోంది. టీడీపీ బాధ ప్రపంచ బాధ కాని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుంచి నాలుగవ విడత వారాహీ యాత్రలో చంద్రబాబు అరెస్ట్ మీద గర్జిస్తారా అధికార వైసీపీ మీద విరుచుకుపడతారా అన్నది ఆసక్తిని రేపుతోంది. అదే సమయంలో ఏపీలో పొత్తుల పైన విపక్షాల ఐక్యత మీద ఆయన ఏమి చెబుతారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది.

ఇక ఏపీలో బీజేపీ పాత్ర మీద బాబు అరెస్ట్ తరువాత వారి మీద పడుతున్న అనుమానపు చూపుల మీద ఆ పార్టీతో ఈ రోజుకీ అఫీషియల్ గా పొత్తులో ఉన్న జనసేనాని ఏమి చెబుతారు అన్నది మరో చర్చ. బీజేపీని ఆయన చాలా రోజుల క్రితం సమర్ధిస్తూ వచ్చారు. చంద్రబాబుని జైలులో పరామర్శించి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడినపుడు బీజేపీకి బాబు అరెస్ట్ తో సంబంధం లేదని క్లారిటీగా చెప్పారు.

ఆ తరువాత మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ తాను తొందరలో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలసి పొత్తుల విషయం ఏపీలో రాజకీయాల గురించి చర్చిస్తాను అన్నారు. కానీ అదీ జరగలేదు. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి స్పందన కోసం ఎదురు చూసి కూడా మూడు వారాలు గడచిపోయాయి.

దాంతో బీజేపీ మీద ఆయన స్టాండ్ ఏమిటి అన్నది కూడా వారాహి యాత్రలో చెబుతారా అన్నది చూడాల్సి ఉంది. అన్నింటికీ మించి ఏపీలో కొత్తగా ఏర్పడుతున్న ఒక రకమైన నిశ్శబ్దత రాజకీయ శూన్యత నుంచి జనసేన ఎంతవరకూ తన వాటాను ఆశిస్తోంది అన్నది కూడా పవన్ విడమరచి సభలో చెబుతారా అన్నది చూడాల్సి ఉంది. సో పవన్ ఏమి చెబుతారు అన్నది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News