పవన్ పొలిటికల్ రిటైర్మెంట్ ఎపుడంటే...?
జనసేన పెట్టినపుడు పాతికేళ్ళ ప్రస్థానం అని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. చూస్తూండగానే పదేళ్ళు గడచిపోయాయి.
జనసేన పెట్టినపుడు పాతికేళ్ళ ప్రస్థానం అని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. చూస్తూండగానే పదేళ్ళు గడచిపోయాయి. దాంతో పవన్ ఇటీవల తరచూ యువతరం రాజకీయాల్లోకి రావాలి అని అంటున్నారు. తాను మహా అయితే మరో పదిహేనేళ్ల పాటు రాజకీయాలు చేయగలను అని ఆయన పెడన సభలో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు.
తాను ఒక్కడినే రాజకీయాల్లో పూర్తి కాలం ఉండాలని తానే అంతా చేయాలని అనుకోవడంలేదని అన్నారు. తన తరువాత తరాన్ని తయారు చేయడం కోసమే జనసేన పెట్టాను అన్నారు. ఈ రోజున ఇరవై ఏళ్ళ యువత 2047 నాటికి దేశాన్ని ఏలాలంటే వారిని మంచి నాయకులుగా తీర్చిదిద్దాల్సి ఉంది.
అలాంటి యువతరం నేతలను జనసేన తీర్చిదిద్దుతుందని పవన్ అంటున్నారు. తాను ఎపుడూ సగటు మహిళ యువత అభివృద్ధినే కోరుకుంటాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో రాజకీయాల్లో అవినీతి అన్నది మామూలు అంశం అయిపోయింది. ఇపుడు డిబేట్ చేయాల్సింది అవినీతి పోవడం గురించి కాదు, ఎంతవరకూ అవినీతిని ఆమోదించవచ్చు అన్నది మాత్రమే అని పవన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఓటుకు అయిదు వందల నుంచి పదిహేను వందల దాకా తీసుకుంటున్న ఓటర్లకు నాయకుల అవినీతిని ప్రశ్నించే హక్కు లేదని పవన్ అన్నారు. ఓటుని అమ్ముకున్న వారు సత్య హరిశ్చంద్రులు తమ పాలకులు కావాలని అనుకోవడం తప్పే అన్నారు. రాజకీయ నాయకులు కూడా తాము ప్రజల నుంచి దోచుకున్న దాని నుంచే తిరిగి కొంత ఇచ్చి ఓట్లు కొంటున్నారు అని ఆయన అన్నారు. ఇది రాబిన్ హుడ్ న్యాయమని అంటారని పవన్ చెప్పుకొచ్చారు.
తన దగ్గర డబ్బులు లేవని, అందువల్ల తాను ఓటుకు ఏమీ ఇవ్వలేనని, అదే విధంగా తాను ఎవరి దగ్గరా దోచుకోలేదని పవన్ చెప్పడం విశేషం. లక్ష కోట్లు తిన్న జగన్ని సీఎం గా గెలిపించారు అంటే జనాలు ఆయన అవినీతిని సమర్ధించినట్లే అని పవన్ అన్నారు. అవినీతి కేసులు తన వద్ద పెట్టుకుని జగన్ మాజీ సీఎం చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టించారని మండిపడ్డారు.
జగన్ అవినీతి గురించి మాట్లాడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమైనా లాల్ బహుదూర్ శాస్త్రినా, లేక అటల్ బిహారీ వాజ్ పేయ్ నా అని పవన్ నిలదీశారు. జగన్ డబ్బులు పంచేస్తే పాలన చేసినట్లా అని ప్రశ్నించారు. ఆ డబ్బులు కూడా ఎక్కడ నుంచి వస్తాయి. ఉన్న డబ్బులు పంచేయడం కాదు అభివృద్ధి చేయాలి, అది మాత్రం వైసీపీ పాలకులకు చేతకాదని ఆయన మండిపడ్డారు.
రానున్న తరాలు బాగుపడాలనే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని ఆయన చెప్పారు. టీడీపీ అనుభవం, జనసేన యువశక్తి కలిస్తే 2024 తరువాత మంచి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలు అంతా తమని దీవించాలని కోరారు.