పవన్.. లోకేశ్ ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టరా?

అయితే.. ఆయన పాదయాత్ర విషయంలో అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా హైలెట్ కాలేదని చెప్పొచ్చు

Update: 2024-06-06 13:48 GMT

ఎన్నికల్లో చారిత్రక గెలుపును సొంతం చేసుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఊహించని నిర్ణయాలకు వేదికగా ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకరు. ఇక.. తెలుగుదేశం పార్టీలో ఊపు తెచ్చేందుకుసుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన లోకేశ్ తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరు శాతం న్యాయం చేశారని చెప్పాలి. ఆయన చేసిన పాదయాత్ర ప్రజల్లో పెద్ద ఆదరణ లభించలేదన్న విమర్శలు వినిపించాయి.

అయితే.. ఆయన పాదయాత్ర విషయంలో అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా హైలెట్ కాలేదని చెప్పొచ్చు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కానీ ఆంక్షల్ని విధించి ఉంటే.. అసలు పాదయాత్ర చేసే వారా? అంటూ లోకేశ్ పలుమార్లుప్రశ్నించటం మర్చిపోలేం. లోకేశ్ విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన తన శాయశక్తులా ప్రయత్నం చేశారని చెప్పాలి. ఇలా కూటమి సర్కారులో కీలకమైన పవన్.. లోకేశ్ లు తాజా ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే.. రాజకీయవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్.. లోకేశ్ ఇద్దరు మంత్రి పదవులు చేపట్టరని చెబుతున్నారు. ఇప్పటికే నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ కూడా హాజరవుతారని చెబుతున్నారు. తొలుత ఈ నెల తొమ్మిదిన ప్రమాణస్వీకారాన్ని చేయాలని చంద్రబాబు భావించినా.. తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకోవటం తెలిసిందే.

చంద్రబాబు ప్రభుత్వంలో మొత్తం 25 మంది మంత్రులు ఉండనున్నారు. ఇందులో టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా ఇరవై మంది.. జనసేన నుంచి ముగ్గురు.. బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్న ప్రచారం జరిగినా అది నిజం కాకపోవచ్చంటున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా తాను వ్యవహరించనున్నట్లు చెప్పటం తెలిసిందే. విపక్ష వైసీపీకి ప్రతిపక్ష హోదా రాని నేపథ్యంలో పవన్ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రభుత్వంలో ఉండి.. మరోవైపు ఇలా వ్యవహరించటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

దీంతో.. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు మీద ఫోకస్ చేసేలా పవన్ ప్రయత్నిస్తారని.. ఆ దిశగా ఆయన అడుగులు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు లోకేశ్ విషయానికి వస్తే.. తాను మంత్రిగా వ్యవహరించే కన్నా పార్టీ వ్యవహారాల మీద పని చేస్తే మరింత బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి రావటానికి కీలకంగా వ్యవహరించిన పవన్.. లోకేశ్ ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టకపోతే.. అది సరికొత్త రాజకీయంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News