పవన్‌కు మరింత ప్రయారిటీ.. ఆఫీసుల్లో ఫొటోలు
ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవితో పాటు ఇతర శాఖలనూ పవన్‌కు కట్టబెట్టిన బాబు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు మరింత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవితో పాటు ఇతర శాఖలనూ పవన్‌కు కట్టబెట్టిన బాబు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తన ఫొటోలతో పాటు పవన్ ఫొటోలు కూడా ఉండాలని బాబు ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో బాబుతో పాటు పవన్ ఫొటోలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పవన్ ఫొటోలు ఉండాలని బాబు ఆదేశించినట్లు తెలిసింది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్ కీలకంగా వ్యవహరించారు. మొదటి నుంచి బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో టీడీపీతో కూటమి ఏర్పాటులో పవన్ ప్రధాన పాత్ర పోషించారు. జగన్‌ను గద్దె దించడమే ఏకైక ఎజెండాగా ఈ మూడు పార్టీలు సాగడం వెనుక కూడా పవన్ ఉన్నారనే చెప్పాలి. ఎప్పటికప్పుడూ జగన్‌పై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ఓట్లు చీలకుండా పవన్ తనదైన మార్క్ చూపించారు. జనసేన పోటీ చేయని చోట ఆ పార్టీ ఓట్లు టీడీపీ, బీజేపీకి వెళ్లేలా చేశారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో పవన్‌దే ప్రధాన పాత్ర అని రాజకీయ విశ్లేషకులూ అంచనా వేస్తున్నారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న బాబును కలిసి పవన్ స్థైర్యాన్ని అందించారు. ఆ వెంటనే టీడీపీతో పొత్తును ప్రకటించి ఏపీ రాజకీయ సమీకరణాలను మార్చేశారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లోనూ విజయాలు సాధించేలా చూశారు. మరోవైపు బాబుతో కలిసి ప్రచారాన్ని పవన్ హోరెత్తించారు. దీంతో కూటమి అఖండ విజయాన్ని సాధించింది. అందుకే పవన్ కష్టాన్ని బాబు గుర్తిస్తున్నారు. పవన్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు.