పిఠాపురం గీత రాత మార్చేది ఆయనేనట ?
పిఠాపురంలో వైసీపీ అభ్యర్ధి వంగా గీతకు మంచి ఆదరణ జనంలో ఉంది. ఆమె 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు
పిఠాపురంలో వైసీపీ అభ్యర్ధి వంగా గీతకు మంచి ఆదరణ జనంలో ఉంది. ఆమె 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ల పాటు ఎంపీగా కాకినాడ నుంచి ఉన్నారు. పిలిస్తే పలుకుతారు అని ఆమెకు పేరు. ఆమె న్యాయవాద వృత్తిలో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. ఆమె ఎటువంటి సాయం అయినా చేస్తారు అని అంతా అంటారు.
ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లు అయితే పిఠాపురంలో వైసీపీ వ్యూహాలు ఆమెకు చాలా వరకూ ఉపకరించాయి. లోకల్ క్యాండిడేట్ అన్న ట్యాగ్ కూడా ఆమెకు ఉంది. అయితే వీటితో పాటుగా ఆమె గత అయిదేళ్ల వైసీపీ ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకతను సైతం మోయాల్సి వచ్చింది అని అంటున్నారు. 2019 నుంచి 2024 వరకూ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత జనంలో ఉంది అని అంటున్నారు.
సర్వే నివేదికలలో ఆయన పట్ల ఆ విధమైన అభిప్రాయాలు రావడంతోనే జగన్ ఆయన్ని తప్పించారు అని అంటారు. అయితే ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పి గీతకు మద్దతుగా ప్రచారం చేసేలా పార్టీ పెద్దలు చూశారు. అయితే ఆయనే ప్రచారమే ఇపుడు వంగా గీత తల రాతను మార్చిందని కూడా అంటున్నారు.
ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత గీతకు కూడా యాంటీ అయింది అని అంటున్నారు. పెండెం దొరబాబుని జనాలు కోరుకోవడం లేదు. అయితే ఆయన మరోసారి వైసీపీ నుంచి చురుకుగా ప్రచారంలో కనిపించడంతో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత కాస్తా గీతకు కూడా ఇబ్బందికరంగా మారింది అన్నది ప్రచారంలో ఉన్న ఒక విశ్లేషణ.
దాంతో పాటుగా పవన్ కొత్త వారు, ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే చాన్స్ ఇచ్చి చూడాలని జనాలు గట్టిగా నిర్ణయించుకున్నారని అంటున్నారు. పవన్ సైతం తొలి సభలోనే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విన్నపం చేసుకున్నారు. దాంతో పవన్ విన్నపాన్ని ఆ సభలోనే ప్రజలు మనస్పూర్తిగా మన్నించారు అని అంటున్నారు.
దాంతో పవన్ కి సొంత సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా భారీ ఎత్తున మద్దతుగా నిలిచాయని అంటున్నారు. ఈసారి పవన్ కి ఇస్తే తమకు మేలు చేస్తారని అత్యధిక శాతం ప్రజలు భావించారు అని అంటున్నారు. అందులో బీసీలు ఎస్సీలు ఇతర వర్గాలు కూడా ఉన్నారని అంటున్నారు.
దాదాపుగా పిఠాపురంలో పోలింగ్ అంతా ఏకపక్షంగా సాగింది అని అంటున్నారు. అయితే పవన్ మెజారిటీ ఎంత అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తోంది. అయితే అంతా చెబుతున్నట్లుగా లక్ష మెజారిటీ రాకపోవచ్చు అని అంటున్నారు. కానీ పవన్ మెజారిటీ నలభై వేల నుంచి మొదలై యాభై వేల పై దాటి ఉంటుందని ఒక అంచనా అయితే అంతా వేస్తున్నారు. అది కూడా పిఠాపురం చరిత్రలో ఒక రికార్డుగానే చూస్తున్నారు. వర్మకు 47 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. ఇపుడు దాన్ని పవన్ తిరగరాస్తారని అంటున్నారు. మరీ వేవ్ ఎక్కువగా ఉంటే పవన్ మెజారిటీ అరవై వేలకు పై దాటినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా వంగా గీత విషయంలో అనేక ఫ్యాక్టర్లు వ్యతిరేకంగా పనిచేశాయన్నది ఒక విశ్లేషణ గా ఉంది. అయితే ఇవన్నీ ప్రచారంలో ఉన్నవే. వీటిలో ఏది నిజం ఏది అవాస్తవం అన్నది చూడాలంటే జూన్ 4 వరకూ వేచి ఉండాల్సిందే.