రాయలసీమ నుంచి పవన్ సిద్ధం....!
ఇటీవల సిద్ధం పేరుతో వైసీపీ మూడు కీలకమైన ప్రాంతలు మూడు రీజియన్లలో భారీ సభలను నిర్వహించింది
ఇటీవల సిద్ధం పేరుతో వైసీపీ మూడు కీలకమైన ప్రాంతలు మూడు రీజియన్లలో భారీ సభలను నిర్వహించింది. ఇవి ఒకదానికి మించి మరొకటి విజయం సాధించాయి. ఒక విధంగా వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని వెరైటీగా తెర తీసింది. క్యాడర్ ని సిద్ధం చేయడం కోసం మీటింగ్స్ అంటూ జనాలకు ప్రతిపక్షాలకు కూడా వైసీపీ తన సందేశాన్ని అందించింది.
వైసీపీ బలంగా ఉందన్న సందేశం కూడా విపక్షాలకు చేర్చింది. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభ విజయవంతం అయిన నేపధ్యంలో కూటమి కూడా మేము సిద్ధం అని రీసౌండ్ చేయాలని చూస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఆయన రాయలసీమ నుంచే తన ప్రచారాన్ని మొదలెట్టనున్నారు అని అంటున్నారు. టీడీపీ జనసేన కూటములకు మద్దతుగా పవన్ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తారు అని అంటున్నారు. పవన్ ఇప్పటిదాకా ఉత్తరంధ్రాలోని విశాఖ, అలాగ ఉభయగోదావరి జిల్లాలలో వారాహి యాత్రను నిర్వహించారు. ఇపుడు ఆయన రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
కూటమి వ్యూహం ప్రకారం వైసీపీకి ఈ రోజుకూ బలంగా ఉన్న రాయలసీమలోనే కోటలను బద్ధలు కొట్టాలని చూస్తున్నట్లుగా ఉంది. రాయలసీమలో గత సారి వైసీపీ 52 అసెంబ్లీ సీట్లకు గానూ 49 సీట్లను గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను వీలైనంత మేర తగ్గిస్తే కోస్తా జిల్లాలలో తమ బలానికి అది అదనం అవుతుందని అపుడు సులువుగా అధికార పీఠాన్ని అందుకోవచ్చు అని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో రాయలసీమ టార్గెట్ గా పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఉత్తరాంధ్రాలో శంఖారావం పేరుతో ప్రతీ నియోజకవర్గంలో సభలు నిర్వహించారు. చంద్రబాబు కోస్తా అంతటా తిరుగుతున్నారు. రా కదలిరా సభలతో హోరెత్తిస్తున్నారు.
ఇక నారా లోకేష్ గోదావరికి షిఫ్ట్ అయితే దక్షిణ కోస్తా జిల్లాల చంద్రబాబు టూర్లు ఉంటాయని అంటున్నారు. ఇలా ఎన్నికలు దగ్గర పడేవరకు ముగ్గురు నేతలూ ఏపీలోని అన్ని ప్రాంతాలను కలియతిరుగుతారని అంటున్నారు. పవన్ ని జగన్ మీదకు ప్రయోగిస్తూ రాయలసీమలో ఎక్కువ సీట్లు గెలుచుకునేలా కూటమి ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.
బలిజలు రాయలసీమలో అధికంగా ఉన్నారు. వారిని కూటమి వైపు గా తీసుకుని వస్తే ఈసారి అక్కడ వైసీపీ వీక్ అవుతుందని వ్యూహరచన చేస్తున్నారు. పవన్ వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచి ఎలా రీ సౌండ్ చేస్తారో చూడాల్సి ఉంది.