కూటమి తరఫున సీఎంను ప్రతిపాదించిన పవన్

తాజాగా కూటమి శాసన సభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో భేటీ అయ్యారు.

Update: 2024-06-11 07:10 GMT

అనుకున్నదే కానీ.. అనుకున్న దానికి మించిన ఎమోషన్ తో ఏపీ అసెంబ్లీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమం పూర్తైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటం ల్యాండ్ స్కేప్ విక్టరీని సొంతం చేసుకోవటం తెలిసిందే. రేపు (బుధవారం) ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన సాంకేతిక అంశాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి.

తాజాగా కూటమి శాసన సభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ భావోద్వేగంతో మాట్లాడారు. క్లైమోర్ మైన్ పేలి.. కారు పైకి ఎగిరి పడిన తర్వాత కూడా వెరవకుండా చొక్కా దులుపుకొని రాజకీయాలు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని.. ఆయన సారథ్యంలో ఏపీలో పాలన సాగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ రోజున సైబరాబాద్ ఉందంటే అది చంద్రబాబు కారణంగానేనని పేర్కొన్నారు.

కూటమి తరఫున ఏపీ తదుపరి ముఖ్యమంత్రిగా చంద్రబాబును తాను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. సభా ప్రాంగణం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపత్యంలో ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపనున్నారు.

అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పవన్ ప్రతిపాదన చేసిన సమయంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. కూటమి శాసన సభ్యులంతా లేచి తన హర్షాతిరేకాల్ని వ్యక్తం చేశారు. వేదిక మీద చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. పురంధేశ్వరి.. అచ్చెన్నాయుడులు ఆసీనులయ్యారు.

Tags:    

Similar News