పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు!

జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తేల్చిచెప్పారు.

Update: 2024-02-10 09:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలుస్తుందా, లేదా అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. కాగా టీడీపీ, జనసేన పొత్తుపై ముఖ్యంగా జనసేన శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందని టాక్‌ నడుస్తోంది. టీడీపీ నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలని, పవన్‌ కళ్యాణే ముఖ్యమంత్రిగా ఉండాలని లేదా పవర్‌ షేరింగ్‌ ప్రకారం చెరో రెండున్నరేళ్లు చంద్రబాబు, పవన్‌ సీఎంగా ఉండాలని జనసేన శ్రేణులు కోరుకుంటున్నాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. జనసేన పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని జనసేన శ్రేణులకు సూచించారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని కుండబద్దలు కొట్టారు.

అభిప్రాయాలూ, సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ దృష్టికి తీసుకురావాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరతాయని తెలిపారు. అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించానని తెలిపారు.

కాబట్టి పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడరుకు సూచించారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరం అని జనసేన శ్రేణులకు సూచించారు.

Tags:    

Similar News