భీమవరం పోటీపై పవన్ తేల్చేశారా...!?
పవన్ కూడా ఇటీవల భీమవరం వెళ్ళి లోకల్ లీడర్స్ తో సమావేశం అయ్యారు. అదే విధంగా టీడీపీ నేతల ఇంటికి వెళ్ళి వారితో కూడా మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వాలని కూడా కోరుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. భీమవరం నుంచి 2019లో పోటీ చేసిన పవన్ ఈసారి కూడా అక్కడే చేసి గెలవాలని ఆ విధంగా వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించారు అని అంటున్నారు.
అలా జరగాలని కూడా జనసేన సైనికులు కోరుకుంటున్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే లక్షకు తగ్గకుండా మెజారిటీ ఇస్తామని కూడా చెబుతున్నారు. పవన్ కూడా ఇటీవల భీమవరం వెళ్ళి లోకల్ లీడర్స్ తో సమావేశం అయ్యారు. అదే విధంగా టీడీపీ నేతల ఇంటికి వెళ్ళి వారితో కూడా మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వాలని కూడా కోరుకున్నారు.
తీరా చూస్తే ఇపుడు భీమవరం విషయంలో పవన్ పోటీ చేయడం లేదని టాక్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులుని పిలిచి పోటీ చేయమని పవన్ కోరినట్లుగా ప్రచారం సాగింది. ఇపుడు దాన్ని కన్ ఫర్మ్ చేశారు రామాంజనేయులు. నన్ను పవన్ పిలిచి మాట్లాడారు అని ఆయన చెప్పారు. భీమవరం నుంచి నేను పోటీ చేస్తానో లేదో చెప్పలేను అంటూ పవన్ అన్నారని రామాంజనేయులు చెప్పడం విశేషం.
మీరు పోటీ చేస్తారా అని తనను అడిగారు అని కూడా చెప్పారు. అయితే తాను పోటీ చేయడం కంటే పవన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పాను అని రామాంజనేయులు వెల్లడించారు. ఒకవేళ పవన్ పోటీ చేయకపోయినా ఎవరు పోటీ చేసినా తన మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు. భీమవరంలో కీలక నేతగా 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు తాను జనసేనలో చేరుతాను అని చెబుతున్నారు.
ఇక భీమవరం పోటీ మీద రెండు రోజులలో పవన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు అని ఆయన చెప్పారు. మొత్తం మీద చూస్తే పవన్ భీమవరంలో పోటీ చేయడంలేదా అన్నది హాట్ టాపిక్ గా ఉంది. ఒకవేళ ఆయన పోటీ చేస్తే మద్దతు కోసం రామాంజనేయులుని పార్టీలోకి తీసుకుంటున్నారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా పక్కా లోకల్ లీడర్ గా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రామాంజనేయులు జనసేనలో చేరితే మాత్రం అది ఆ పార్టీకి చాలా బలంగా ఉంటుందని అంటున్నారు. రేపటి రోజున పవన్ పోటీ చేసినా ఆయనకు జనసేన నుంచే సొంతంగా మద్దతు దొరుకుతుందని, గెలుపు కాదు మెజారిటీయే చూసుకోవచ్చు అని అంటున్నారు.