నిండు సభలో పవన్ స్ట్రాంగ్ స్టేట్మెంట్
ఒకవేళ చేశారు అని ఇతరులు ఆధారాలు చూపించినా కాదని దబాయిస్తారు.
తప్పు నేను చేసినా చర్యలు తీసుకోండి అంటూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిండు సభలో ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్మెంట్ సంచలనంగానే చూడాలి. నిజానికి ఈ తరహా ప్రకటనలు అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ఆశించలేము. అధికారంలో ఉన్న వారు తాము తప్పు చేయలేదనే చెబుతారు.
ఒకవేళ చేశారు అని ఇతరులు ఆధారాలు చూపించినా కాదని దబాయిస్తారు. అధికారం తమ తప్పులను కప్పిపుచ్చుతుందని ఒక భావనలో ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి భిన్నమైన పంధానే ఎంచుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉంటున్నారు. ఎక్కడా మాట తూలడం లేదు. విపక్షాన్ని పరుషంగా విమర్శించడం లేదు.
అధికారంలో ఉన్నపుడు బాధ్యతగా ఉండాలని ఆయన తాను తెలుసుకుని ఆచరించి చూపుతున్నారు. తన పార్టీ వారిని అదే ఆచరించ మంటున్నారు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వం వారు తప్పులు చేశారని అదే విధంగా మనమూ చేయనక్కరలేదని అన్నారు.
రాజకీయ కక్షలు అంతా విరమించాలని ఆయన కోరారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారమే తగిన చర్యలు ఉంటాయి తప్ప వ్యక్తిగత కక్షలకు తావు లేదని పవన్ స్పష్టం చేశారు. కూటమి సభ్యులు ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని ఆయన హితవు చెప్పారు. అంతే కాదు అవినీతికి ఆస్కారం లేని విధంగా పాలన చేద్దామని చెప్పారు.
తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని ఆఖరుకి తాను చేసినా శిక్షకు సిద్ధమని ఆయన చెప్పారు. ఇదంతా పవన్ ఎందుకు చెప్పారూ అంటే ఎవరూ తప్పు చేయకూడదు అనే ఉద్దేశ్యంతోనే. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం చాలా కచ్చితంగా ఉంటుందని ఆయన అన్నారు. అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ఆయన కోరారు.
ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ పునర్ నిర్మాణం కోసం చంద్రబాబుకు తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. గత వైసీపీ పాలనలో పోలవరం తో పాటు అమరావతి రాజధాని కూడా ఆగిపోయిందని అన్నారు. దీంతో మళ్లీ రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని ఆయన అన్నారు. తెలుగు నేల మీద ఎందరో మహానుభావులు జన్మించారని ఆయన గుర్తు చేశారు. వారి స్పూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఆయన కోరారు.
రాష్ట్రం అన్నింటా అగ్రభాగాన నిలవాలని ఆయన ఆకాంక్షించారు. మొత్తానికి వైసీపీ ఒక వైపు ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న వేళ కక్ష సాధింపు రాజకీయాలు వద్దు అని పవన్ నిండు సభ వేదికగా చేసుకుని కూటమి పార్టీలకు ఒక సందేశం పంపారని అంటున్నారు.