ఒక పత్రిక, రెండు ఛానల్స్ కు పెద్దిరెడ్డి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు!

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు ఆరోపణలు మీడియాలో దర్శనమిచ్చాయి!

Update: 2024-08-20 16:56 GMT

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.. ఘటనాస్థలికి హెలీకాప్టర్ లో హుటాహుటిన వెళ్లాలని డీజీపీ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు ఆరోపణలు మీడియాలో దర్శనమిచ్చాయి!

అసలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం ఘటనలో వైసీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల ప్రమేయం ఉన్నట్లు కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రచారం జరిగిందనే విషయంపై తాజాగా పరువునష్టం నోటీసులు జారీ చేశారు.

అవును... మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనలో తనపై ప్రతికూల కథనాలు ప్రసారం చేశారంటూ వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ పై నోటీసులు జారీ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఒక పత్రిక, రెండు న్యూస్ ఛానల్స్ కు కలిపి రూ.100 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాలని పెద్దిరెడ్డి కోరినట్లు కథనాలొస్తున్నాయి.

ఇందులో భాగంగా ఓ ప్రముఖ దినపత్రికకు, దాని అనుబంధ న్యూస్ ఛానల్ తో పాటు మరో న్యూస్ ఛానల్ పరువునష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులో పంపినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ప్రముఖ దినపత్రిక, దాని ఛానల్ రూ.50 కోట్లతో పాటు.. మరో న్యూస్ ఛానల్ రూ.50 కోట్లు చొప్పున చెల్లించాలని నోటీసులో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన మాజీమంత్రి... కొందరు స్వార్థపరులు కావాలనే తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన తెలిపారు.

కాగా... మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటన విచారణను రాష్ట్ర ప్రభుత్వం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 2,400 ఫైళ్లు పూర్తిగా దగ్ధమవ్వగా.. మరో 700 ఫైళ్లు పాక్షికంగా దగ్ధమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదే సమయంలో ఇది ప్రమాదవశాతూ జరిగింది కాదని దర్యాప్తులో వెల్లడైనట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News